Tourism Department Proposals to Govt For Caravan Project: ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రసిద్ధిగా పేరుంది. జిల్లా సమీపంలోనే రెండు మహా నగరాలు ఉండటం మరింతగా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇన్ని సానుకూలతలున్నా గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో ఆ శాఖ మంత్రి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించినా పర్యాటక రంగం దైన్యస్థితిని చవిచూసింది. ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదలలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కారవాన్ టూరిజం ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు 2014-19లో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు యత్నించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రామకుప్పం మండలం ననియాలలో ఎకో టూరిజం ప్రాజెక్టును నిర్మించి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నిధులను సైతం విడుదల చేశారు. పనులు చివరి దశలో ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో పడకేసింది. ప్రస్తుతం కూటమి అధికారం చేపట్టడంతో అధికారులు ఆఘమేఘాలపై కదిలారు. పెండింగ్ పనుల పూర్తితోపాటు కారవాన్ టూరిజాన్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కేరళలో ఉండే విధంగా కారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. కేరళ వరకు వెళ్లి మధ్యలో ఎక్కడైనా తిరిగేందుకు అవకాశం కల్పించనున్నారు. అదే విధంగా తిరుపతి నుంచి శ్రీశైలం వరకు మూడు రోజులకు కారవాన్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గండికోట జలాశయం చూసే వెసులుబాటు ఉంది.
టూరిజం అభివృద్ధికి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ప్రదేశాలు : తలకోన, సింగిరికోన, కైలాసకోన, చంద్రగిరి కోట, మామండూరు అటవీ ప్రాంతం, మల్లెమడుగు జలాశయం, ఆరణియార్ ప్రాజెక్టు, పులికాట్ సరస్సు, నేలపట్టు, చౌడేపల్లె మండలం బోయకొండ, పెనుమూరులోని పులిగుండు, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ జలపాతం, రామకుప్పంలోని ననియాల ఎకో టూరిజం. జిల్లాలోనూ కారవాన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలున్నాయని పర్యాటక శాఖ అధికారులు భావించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 15 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
అభివృద్ధికి రూ.5 కోట్లు అవసరం : ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాల అభివృద్ధికి రూ. 5 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. వీటితో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. సర్కార్ నుంచి కారవాన్ వస్తే ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చన్నారు. చిత్తూరు జిల్లాకు దగ్గరలోనే బెంగళూరు, చెన్నై ఉన్నందున పర్యాటకుల తాకిడి మరింత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రజాప్రతినిధులూ చొరవ చూపితేనే : పర్యాటక శాఖ నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కారవాన్ ప్రాజెక్టు ఆచరణలోకి రావాలంటే ప్రజాప్రతినిధుల చొరవ కీలకంగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చూస్తేనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుంది. దాంతో రానున్న రోజుల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక పెరుగుతుంది. పర్యాటకుల రాకతో స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
'వంద రోజుల్లో వంద కోట్లు' - సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక - SURYALANKA BEACH