Tobacco Price Rise in Andhra Pradesh: ఈ ఏడాది పొగాకు పంటకు ధర అనుకూలించడం రైతాంగానికి ఊపిరి పోసింది. బ్రెజిల్‌లో పొగాకు పంటకు నష్టం రావడంతో ఏపీలో పండిన పంటకు డిమాండ్ పెరిగింది. పంట పెట‌్టుబడి పెరుగుతున్నా, ధర ఆశాజనకంగా ఉండటం ఊరట కలిగించిందని రైతులు అంటున్నారు. అయితే పొగాకు ధర బాగుండటంతో కౌలు ధరలు పెరిగిపోతున్నాయని, వచ్చే ఏడాది ఇంతే ధర ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం పెరిగిన కౌలు ధరలు, బార్న్ అద్దెలతో పెట్టుబడి భారమై నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 72వేల 340 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు 57వేల760 హెక్టార్లకే అనుమతి ఇచ్చినప్పటికీ, దిగుబడి తగ్గుతున్న కారణాలతో అదనంగా సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది 86.93 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, దాదాపు 134 మిలియన్ల కిలోలు ఉత్పత్తయింది. డిసెంబర్ నెలలో మిగ్‌జాం తుపాన్ వల్ల మొక్కదశలో ఉన్న పొగాకు పంటకు నష్టం వాటిల్లింది. దీంతో మరోసారి పంట సాగుచేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి అనుకున్నంత రాలేదు. గతంలో ఎకరాకు 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పంట, ఈసారి 6, 7 క్వింటాళ్లకు పడిపోయింది. దిగుబడి తగ్గినా ధర ఆశాజనకంగా ఉండటం పొగాకు రైతుకు ఊరటనిచ్చింది.
పొగాకు కొత్త వంగడంపై రైతన్నలకు అవగాహన సదస్సు
గతేడాదితో పోల్చితే పొగాకు సరాసరి ధర కంటే కిలోకు 30 నుంచి 50 రూపాయలు అదనంగా వస్తుండటం పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. గరిష్టంగా 302 రూపాయల వరకూ పలుకుతోంది. ఇది రికార్డుస్థాయి ధరగా రైతులు అభిప్రాయపడుతున్నారు. ధర అనుకూలించినా, సాగు ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరను చూసి భూయజమానులు కౌలు ధర, బార్న్ అద్దె ధరలను అమాంతం పెంచుతున్నారని చెబుతున్నారు.
వచ్చే ఏడాది ధర ఆశించిన స్థాయిలో లేకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. బార్న్‌లో అగ్నిప్రమాదాలు జరిగి నష్టపోతే బీమా సక్రమంగా అందటం లేదని, అరకొర చెల్లించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారని వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లా పరిధిలో కొనుగోళ్లు ఉత్సాహంగా సాగుతున్నాయని, బయ్యర్లు గతం కంటే పెరిగారని, పోటీ కారణంగా గ్రేడ్ పొగాకు ఇంకా మంచి ధర పలికే అవకాశం ఉందని పొగాకు బోర్డు అధికారులు చెబుతున్నారు.
"ఈ ఏడాది సగటు ధర ఇప్పటి వరకూ 252 రూపాయలుగా ఉంది. ఇది గతేడాది ధర కంటే 30 రూపాయలు ఎక్కువ. ఇప్పటి వరకూ లోగ్రేడ్ ఎక్కువగా అమ్ముడైంది. పొగాకు ఎక్కువగా లోగ్రేడ్ ఉన్నాకూడా ధర బాగానే ఉంది. అంతర్జాతీయంగా ఇండియా పొగాకుకి బాగా డిమాండ్ ఉంది". - అద్దంకి శ్రీధర్ బాబు, పొగాకు బోర్డు ఈడీ