Tirumala Brahmotsavam Garuda Vahana Seva: తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి అత్యంత విశేషంగా నిర్వహించే గరుడ వాహన సేవ కోసం అధికారులు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారు. నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు.
దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని, తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు వచ్చేందుకు వీల్లేదని అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసిందని, 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. మాడ వీధుల గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వీలు ఉందన్నారు.
ముఖ్యమైన కూడళ్లలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్, 3800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరా నిఘలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తామన్నారు. గ్యాలరీలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణి చేస్తామన్నారు. గరుడ సేవ రోజున మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రద్దీని నియంత్రించేందుకు చర్యలు: లక్షలాది భక్తులు తరలివచ్చే వేళ కొండపై రద్దీని నియంత్రించేందుకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేటి అర్థరాత్రి నుంచే ఘాట్ పైకి ద్విచక్రవాహనాలను నిషేధించిన టీటీడీ భద్రతా సిబ్బంది, వాటి పార్కింగ్ కోసం అలిపిరి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక స్థలాలను కేటాయించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చే భక్తులకు, స్థానికుల వాహనాలకు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ కేటాయించారు.
భక్తులు వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేయటం ద్వారా ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతం కంటే అధికంగా తిరుమల - తిరుపతి మధ్య గరుడసేవ రోజు మూడు వేల ట్రిప్పులతో 2.50 లక్షల మంది భక్తులను తిరుమలకు ఆర్టీసీ చేర్చనుంది. గరుడ వాహన సేవను ప్రశాంతంగా తిలకించేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు తెలుసా? - Tirumala Srivari Brahmotsavam 2024
తిరుమలలో 'కల్పవృక్షం' అధిరోహించిన మలయప్పస్వామి - తరించిన భక్తులు - Tirumala Brahmotsavalu 4th Day