Tipper Owners Problems Due to There is no Single Sand Reach in Joint Anantapur District: ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానానికి అనంతపురం జిల్లాలో అధికారులు అడ్డుగా మారారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క ఇసుక రీచ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో టిప్పర్ యజమానులు పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక రీచ్‌లు తెరిచి లోడింగ్ ఛార్జీలతో టిప్పర్లకు లోడ్ చేయాలని చెప్పినప్పటికీ, రీచ్‌లు తెరవలేదు. పొరుగు జిల్లాల నుంచి ఇసుక తీసుకొస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని టిప్పర్ యజమానులు వాపోతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఇసుక రీచ్‌లు తెరవకపోవడంతో ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఏర్పాటు చేశాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో రీచ్‌లను గుర్తించి నివేదిక పంపారు. రాయదుర్గం నియోజకవర్గంలో రచ్చుమర్రి, ధర్మవరం నియోజకవర్గంలో సీసీరేవు గ్రామాల్లో ఇసుక రీచ్‌లు తెరిచినట్లుగా ప్రకటించారు. అయితే ఆ రెండు చోట్ల పట్టుమని 20 రోజులు కూడా ఇసుక లోడింగ్ జరగలేదని, నెలరోజులుగా టిప్పర్లు తిప్పకుండా బ్యాంకు రుణాలు ఎలా చెల్లించాలంటూ టిప్పర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2,566 కోట్ల కుంభకోణం - గనుల ఘనుడు వెంకటరెడ్డికి బెయిల్
ప్రభుత్వం ఆదేశాలిచ్చినా జిల్లాలో ఇసుక రీచ్ లు ప్రారంభించకపోవడంతో అనంతపురం జిల్లాలోని ఇసుక టిప్పర్లు నెలరోజులుగా నిలిచిపోయాయి. కొందరు యజమానులు పొరుగు జిల్లాల్లోని రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్ చేసుకొని అనంతపురంలో విక్రయాలు చేస్తున్నారు. కొందరు ఇసుక టిప్పర్ల యజమానులు కంకర తరలిస్తున్నారు. ఇసుక లోడింగ్ లేకపోవడంతో బండ్లు నిలిచిపోయి తమకు వేతనాలు ఇవ్వడంలేదని టిప్పర్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
'ఇసుక రిచ్‌లలో లోడింగ్‌లు లేవు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు. టిప్పర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడే రిచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మా జీవనోపాధి సంక్లిష్టంగా మారింది. వాహనాలకు ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాం. కొందరమైతే కంకర తరలిస్తున్నాం. బ్లాక్ మార్కెట్ నడిపేవారు నడుపుతూనే ఉన్నారు.' - టిప్పర్ యజమానులు, డ్రైవర్లు
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఇసుక రీచ్ లను వెంటనే ప్రారంభించి, తమను నష్టాల నుంచి కాపాడాలని టిప్పర్ల యజమానులు కోరుతున్నారు.