Thummalabailu Jungle Safari Ride : శ్రీశైలం అంటే చాలామందికి అటవీ ప్రయాణం గుర్తొస్తుంటుంది. ఘాట్‌రోడ్డు ఇరువైపులా చెట్లు, ప్రాజెక్టు, బోట్ ప్రయాణం ఇలా చాలా అనుభూతులతో కూడిన ప్రయాణం అది. దేవాలయానికి వెళ్లినవారు చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తారు. అయితే అక్కడే కాకుండా శ్రీశైలం వెళ్లే నల్లమల్ల అటవీ చాలా ప్రత్యేకం. జర్నీలో ఎలా ఉన్నా అడవి ప్రయాణం మొదలైందంటే చాలు కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంటాం. ఎక్కడ ఏం కనిపిస్తుందా అని. అలాంటి అనుభూతులు పర్యాటకులకు అందిచడానికే తుమ్మలబైలు జంగిల్ సఫారీని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. దాదాపు 13కిలో మీటర్లు ఉండే ఈ ప్రయాణం మరువలేని అనుభూతులు పంచుతోంది. దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు : వన్య ప్రాణులు తిరిగే ఈ ప్రాంతంలో వ్యాన్ నుంచి అడవిని వీక్షిస్తూ, గైడ్ చెప్పే విషయాలు వింటూ ఆస్వాదించవచ్చు. ఒక్కోసారి పులులు కూడా కనిపిస్తుంటాయి. తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న పులులు చెట్లపై వేసిన పంజా గుర్తులు, అడుగు జాడలు కనిపిస్తుంటాయి. వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూ ఆనందపరుస్తాయి. ఈ అడవిలో దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు ఉన్నాయి. జంతువుల జాడ తెలుసుకోడానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు, జంతువుల కోసం తాగు నీటి ఏర్పాట్లు కూడా ఈ రైడ్‌లో పర్యాటకులు చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటారు.
Nallamala Jungle Safari : తుమ్మలబైలు జంగిల్ సఫారిలో పర్యటన అనంతరం మ్యూజియం కూడా చూడొచ్చు. వివిధ రకాల జంతువుల కొమ్ములు, కళేబరాలు ఇక్కడ భద్రపరిచారు. అటవీ జంతువుల అరుపులు, వాటి ప్రవర్తనను అవగాహన కల్పించేందుకు వీడియో, ఆడియో ప్రదర్శన కూడా ఉంటుంది. ఇవన్నీ చూసిన పర్యాటకులకు విజ్ఞానాన్ని అందిస్తుంది. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ సఫారీ రైడ్ ఉంటుంది.
"పర్యాటకులను తుమ్మలబైలు జంగిల్ సఫారీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సఫారీ ముఖ్య ఉద్దేశం ప్రజలకు అడవుల సంరక్షణ గురించి తెలియజేయడమే. పర్యాటకులకు అడవుల సంరక్షణ, వన్యప్రాణులను కాపాడుకోవడం గురించి వివరిస్తాం. 13 కిలోమీటర్ల ట్రాక్ ద్వారా సందర్శకులను తీసుకెళ్లి నల్లమల అడవి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం. వారికి వినోదంతో పాటు విజ్ఞానం అందిస్తాం. ప్రజలకు అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతను వివరిస్తాం."- విశ్వేశ్వరరావు, రేంజ్ అధికారి