Attack On MPTC in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలికి చెందిన టీడీపీ ఎంపీటీసీ ఉమామహేశ్వరరావుపై దుండగులు కత్తితో దాడి చేశారు. గాయపడిన అతన్ని హుటాహుటిన అనుచరులు సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?: పాంచాల గ్రామానికి చెందిన గండ్రోత్ శ్రీను ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. సంక్రాంతి పండగ నేపథ్యంలో శ్రీను ఇంటికి వచ్చాడు. సాలూరు పాంచాలి మోసూరు కూడలి సమీపంలో పాన్ షాప్‌కి వెళ్లాడు. అయితే ఇంటికి బైక్‌పై తిరిగి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా నిల్చుని అల్లరి చేస్తున్న యువతను పక్కకు తప్పుకోవాలని శ్రీను సూచించాడు. ఈ సమయంలో శ్రీనుపై గండేపల్లి శివ అనే వ్యక్తి దాడి చేసి అతని సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ డబ్బులను శ్రీను దగ్గర నుంచి తీసుకుంది అతని స్నేహితుడే కావడం గమనార్హం.
భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి
ఎంపీటీసీ గొంతు కోసిన దుండగులు: తనకు జరిగిన అన్యాయానికి ఆవేదన చెందిన శ్రీను పొలం నుంచి అదే దారిలో వెళ్తున్న ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు కనిపిస్తే పిలిచి చెప్పాడు. దీనికి చలించిపోయిన అతను సెల్‌ఫోన్, డబ్బులు ఇచ్చేయాలని సదరు యువకులను కోరాడు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు 'అడగడానికి నువ్వు ఎవడివి' అంటూ అతనిపై సైతం శివతో సహా మిగిలిన వారు దాడి చేసి సెల్ ఫోను డబ్బులు లాక్కున్నారు.
అంతేకాదు సమీపంలోని నూడిల్స్ సెంటర్లో ఉన్న కత్తి తెచ్చి ఎంపీటీసీపై దాడి చేసి గొంతు కోసి హత్యాయత్నం చేశారు. తరువాత గొంతుపై గాయాలై రక్తస్రావం కావడంతో దుండగులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దీన్ని గమనించిన బాధితుడు శ్రీను గాయపడిన ఎంపీటీసీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. తరువాత వైద్యులు సకాలంలో చికిత్స అందించి ప్రాణాపాయం లేదని తెలిపారు.
పాత కక్షలే కారణమా?: తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడి పాతకక్షలే కారణమా? లేదంటే మద్యం మత్తులో యువకులు అలా దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై వెంకట్ సురేష్ సాలూరు ప్రాంత ఆసుపత్రికి చేరుకొని బాధితుల నుంచి వివరాలను సేకరించారు. మోసూరు గ్రామానికి చెందిన యువకులు చేతికి కత్తి ఎలా వచ్చింది? దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్ చెప్పారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారా? లేదంటే వైఎస్సార్సీపీ సానుభూతి పరులెవరైనా చేశారా? అని ఎంపీటీసీ అనుమానం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలను కాలువలో పడేసిన తండ్రి