Digital Arrest Frauds Threats in AP : సైబర్ నేరస్థులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు.
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో బెదిరిస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్స్టేషన్లు, ఫేక్ కోర్టులతోనూ బేజారెత్తిస్తున్నారు. కస్టమ్స్‌లో మీ పార్శిళ్లు పట్టుకున్నారని లేదా అయినవాళ్లు తీవ్ర నేరాల్లో ఇరుక్కున్నారని బెదిరిస్తున్నారు. అంతేకాక డ్రగ్స్, ఉగ్రవాద కేసుల్లో విచారిస్తున్నామో ఇలా రోజుకో వేషం, పూటకో మోసంతో నిలువునా ముంచేస్తున్నారు. ఉన్నచోట నుంచి కదలనివ్వరు, ఊపిరి ఆడనివ్వరు. భయపెట్టడం, బెదిరించడమే వారి పెట్టుబడి. పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతారు.
Cyber Fraud Cases in AP : అసలు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియే లేదని ప్రభుత్వాలు చెబుతున్నా చాలా మంది మోసపోతున్నారు. కొందరు మాత్రం యుక్తితో ఆలోచించి బయటపడుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపు ఫోన్‌లు వచ్చాయి. కానీ వారు చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సైబర్ నేరస్థుడు నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ముంబయికి చెందిన మనీ లాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలున్నాయని చెప్పాడు. ఆమె పేరు, ఆధార్ నంబర్‌తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్‌పై కొన్ని సెక్షన్‌లు ఉటంకిస్తూ అరెస్ట్ వారంట్ చూపించాడు. దీని ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలుశిక్ష, లేక రూ.5 లక్షల జరిమానా లేదా రెండూ విధిస్తామంటూ భయపెట్టాడు.
అలాగే ఒక ఎలక్ట్రికల్ ఏఈకి ఫోన్ చేశాడు. మీ అబ్బాయి సైబర్ నేరంలో ఇరుక్కున్నారని బెదిరించారు. ఆయన లొంగకపోవడంతో కనీసం రూ.5000లు అయినా పంపండంటూ సైబర్ నేరగాళ్లు బతిమాలుకున్నారు. నున్నకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి మీ కుమారుడు మాదకద్రవ్యాల కేసులో నిందితుడని భయాందోళనలకు గురిచేశారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మోసానికి గురికాకుండా బయటపడ్డారు.
ఎవరూ భయపడొద్దు : డిజిటల్ అరెస్ట్, పోలీసులమని వీడియో కాల్ లేదా ఫోన్‌కాల్ చేస్తే ఎవరూ భయపడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాల్ కట్ చేసి, వెంటనే ఫోన్ స్విచాఫ్ చేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాలని వారు పేర్కొంటున్నారు.
విశ్రాంత ఉద్యోగిని బెదిరించి రూ.1.4 కోట్లు కాజేశారు!
డిజిటల్ మోసాలకు ఆ మూడు దేశాలే ప్రధాన కేంద్రాలు- రూ.120కోట్లు నష్టపోయిన భారతీయులు