Road Accident In America 3 AP People Died One Injured : విదేశాల్లో వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా వాళ్లంతా మంచి స్నేహితులు. పండుగలైనా, పుట్టినరోజులైనా, ఏ శుభసందర్భమైనా అందరూ కలసి ఆనందంగా చేసుకునే వాళ్లు. వాళ్ల నివాస ప్రాంతాల్లో బంధువర్గం బాగున్నా వృత్తి రీత్యా వీళ్లుంటున్న అమెరికాలో వీళ్లకు వాళ్లే ఆత్మబంధువులు. అందుకే కాస్తంత సెలవు దొరికినా ఆనందంగా గడుపుతుంటారు. వీరి స్నేహంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాద ఘటనలో కారులో ఏర్పడ్డ మంటల్లో చిక్కుకుని తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.
మూడు రోజుల పాటు వరుస సెలవులు రావడంతో అమెరికాలో ఉంటున్న వీళ్లందరూ సరదాగా గడిపేందుకు చుట్టు పక్కల ప్రాంతాల వీక్షణకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో దక్షిణ బాన్‌హామ్‌కు సమీపంలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయ విదారక ఘటనపై మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరి వెనుక ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేయకనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మరింత విషాదంగా మారింది.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి - STUDENT DIED IN AMERICA ACCIDENT
దూరమైన ఆప్యాయత : తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, లతల పెద్ద కుమార్తె హరిత. కష్టపడి చదువుకుంది. తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ. ఈమెకు 2022 ఫిబ్రవరి 11న కేవీబీపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన సాయి చెన్నుతో వివాహమైంది. ఇద్దరివీ మధ్య తరగతి కుటుంబాలే. వృత్తిరీత్యా అమెరికాలో ఉంటున్నారు. ఎనిమిది నెలల క్రితం సోదరి వివాహం సందర్భంగా ఇక్కడకు వచ్చి వెళ్లారు. హరిత, సాయి చెన్ను ఆప్యాయతను తలుచుకుంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. సాయి ప్రాణాలతో బయటపడాలని ఇరు కుటుంబీకులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
తమ్ముడి కోసం పెళ్లి వాయిదా : తొట్టంబేడు మండలం చిన్నకనపర్తికి చెందిన రాజినేని శివది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులైన రమేష్‌నాయుడు, సుజాతల పెద్దకుమారుడు శివ. తొమ్మిదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. తమ్ముడు లోకేశ్‌ను డాక్టర్ చేయాలన్న సంకల్పంతో ఎంతో శ్రమించి చదివించారు. తమ్ముని చదువు కోసం విశాఖపట్నంలో కుటుంబం ఉంటోంది. ఇటీవల పెళ్లి సంబంధాలు వచ్చినా తమ్ముడు డాక్టర్ అయ్యాక చేసుకుంటానంటూ సున్నితంగా చెప్పారు. ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న శునకాన్ని అల్లారుముద్దుగా పెంచుకునేవారు.
ఆశలన్నీ ఆవిరి : ఓజిలి మండలం రాజుపాలెేనికి చెందిన తిరుమూరు గోపి తండ్రి హైవే పక్కన హోటల్ నిర్వహిస్తున్నారు. ఎంతో కష్టపడి కుమారుడ్ని చదివించారు. తల్లిదండ్రుల శ్రమను కళ్లారా చూసిన గోపి కష్టపడి చదువుకుని అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితం గోపికి వివాహమైంది. భార్య అమెరికా నుంచి ఆర్నెళ్ల కిందట భారత్‌కు వచ్చారు. ఇంతలో ఈ ఘటన జరగడంతో భార్య కుటుంబీకులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని తీసుకువచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తానా సభ్యులతో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిరెడ్డికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అక్కడి వారిని కోరారు.