Old Buildings Demolished In Karimnagar : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలి తల్లి సహా ముగ్గురు పిల్లలు చనిపోవడం అందరినీ కలచి వేసింది. కరీంనగర్ జిల్లాలో శిథిల భవనాల గుర్తింపు ప్రక్రియసాగుతున్నా మొక్కుబడిగానే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 50 నుంచి 60 ఇళ్లకు అధికారులు నోటీసులివ్వగా యజమానులు కూల్చివేసుకున్నట్లు గణాంకాల్లో ఉంది. ప్రభుత్వ భవనాలు, వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలు ఇలా అన్ని కలిపి అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి దాదాపుగా 2 నుంచి 3వేల పైనే కానీ అధికారులు మాత్రం నిర్మాణం చేపట్టిన ఏడాది, గరిష్ట పరిమితి చూసి శిథిలావస్థితికి చేరిన వాటిని గుర్తిస్తున్నారు. గతేడది జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా కురిసిన వర్షాలకు 458 ఇళ్లు కూలిపోయాయి.
అందులో పైకప్పు, గోడలు, పాక్షికంగా కూలినవే ఎక్కువ. ఆయా సమయాల్లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలోని 107 గృహాలు కూలేందుకు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, ధర్మపురి వ్యాప్తంగా 280 ఇళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అయితే అధికారులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడున్న దాదాపు 16 విభాగాల కార్యాలయాలన్నీ పాత కలెక్టరేట్ భవనంలో నడుస్తున్నాయి. పైకప్పు ఊడిపోయి, గోడలు బీటలు వారి ఎప్పుడు ఏది ఊడిపడుతుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడి సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు.
సొంతింటి కోసం కల నెరవేరేనా? : సొంతిళ్లు లేని పేదవారు శిథిలావస్థ ఇళ్లలోనే ఉంటున్నారు. వారు ప్రభుత్వానికి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా పూర్తిస్థాయిలో కేటాయించకపోవడంతో ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్లకు శ్రీకారం చుట్టినా చాలా చోట్ల కేటాయించలేదు.కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయంటే జనం సొంతింటి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
శిథిల భవనాల గుర్తింపు : నగరపాలక సంస్థలో ఇప్పటికే 107 మంది ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు అందించారు. ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రామగుండం కార్పొరేషన్‌లో కేవలం 22 ఇళ్లకు నోటీసులివ్వగా అందులో మూడు ఇళ్లనే కూల్చివేశారు. భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లో అధికారులు పునరావాస చర్యలు చేపట్టడంతో కొద్ది రోజులు అక్కడ ఉంటున్న ప్రజలు మళ్లీ వర్షాలు తగ్గాక తాత్కాలిక మరమ్మతులు చేసుకొని పాడుబడిన ఇళ్లల్లోనే నివసిస్తున్నారు.
నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జనావాసాలున్న ప్రాంతాల్లో కూలిపోయే ఇళ్లకు నోటీసులు ఇవ్వడమే కాకుండాతక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మేయర్ సునీల్‌రావు స్పష్టం చేశారు. శిథిలావస్థ ఇళ్లల్లో పేదలు, దిగువ, మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు కూల్చివేసుకోవాలన్నా పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. కాబట్టి అధికారులే చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.