SIT Investigation on Tirumala Laddu Adulteration Case: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మూడో రోజు సిట్ బృందం విచారణ ముగిసింది. తిరుపతి నుంచి ఉదయం 10 గంటలకు తిరుమల చేరుకున్న సిట్ బృందం టీటీడీలోని పిండిమర, ల్యాబ్‌లో విస్తృతంగా దర్యాప్తు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరకులు నిల్వ చేసే గోదాములను సైతం అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే నిల్వ చేసిన వాటి నాణ్యతను పరిశీలించారు.
టీటీడీ కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను ఏ విధంగా పరిశీలిస్తారనే విషయాన్ని అక్కడి సిబ్బందిని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారనే అంశాన్ని టీటీడీ సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో తిరుమల గోదాముకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్ల నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించే ప్రక్రియను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. లడ్డూ పోటులో విధులు నిర్వర్తించే ఉద్యోగులను విచారణ చేయాల్సి ఉండగా సమయం లేక కుదరలేదని అధికారులు తెలిపారు. అనంతరం తిరుమల నుంచి సిట్ అధికారులు తిరుపతి బయలుదేరి వెళ్లిపోయారు.
జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు? : సీఎం చంద్రబాబు - CM Chandrababu on YS Jagan
కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతి పోలీస్ అతిథి గృహం నుంచి తిరుమలకు సిట్ బృందం వెళ్లింది. ఆదివారం ఈవో శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై సమాచారం అడిగి తెలుసుకుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన సిట్ ఆయనను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించింది. 2 రోజులపాటు వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించిన సిట్ బృందం మూడో రోజు క్షేత్రస్ధాయిలో దర్యాప్తును ముమ్మరం చేసింది.
తిరుమలకు వెళ్ళిన సిట్ 3 బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించింది. ల్యాబ్‌లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలు అడిగి తెలుసుకుంది. తిరుమల లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలను పరిశీలించింది. గోదాముల్లో ముడిసరకుల నాణ్యతను పరిశీలించింది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది.
జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక నాటకీయ పరిణామాలు - Jagan Tirupati Tour