Tulasi Babu Continues as Unofficial MLA in Gudivada Constituency : వైఎస్సార్సీపీ హయాంలో అతడికి అడ్డూ అదుపూ లేదు. సీఐడీ మాజీ చీఫ్, అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు నమ్మినబంటుగా వ్యవహరించాడు. అంతేకాదు ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆరో నిందితుడుగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇతడి అరాచకాలకు అడ్డుకట్టపడుతుందని అంతా భావించారు. కానీ గుడివాడ కేంద్రంగా అతడు పేట్రేగిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆరేడు నెలలుగా తులసి గ్యాంగ్ అరాచకాలతో గుడివాడలో ఇప్పటికే పార్టీకి ఇబ్బందికర వాతావరణం తలెత్తిందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
కామేపల్లి తులసిబాబు ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అంతకు ముందునుంచే ఉన్న వారి పరిచయం ఆ గెలుపుతో మరింత బలపడింది. తులసే అనధికారిక ఎమ్మెల్యేగా చలామణీ అయ్యే స్థాయికి నేడు అనుబంధం పెనవేసుకుపోయింది. ఇప్పుడు గుడివాడను అడ్డాగా మార్చుకుని అసాంఘిక శక్తుల్ని, రౌడీ గ్యాంగుల్ని వెంటేసుకుని సెటిల్‌మెంట్లు, దందాలతో రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గుడివాడలో ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా తులసి హవానే నడుస్తోందని, మొదట్లో ఒంగోలు నుంచి తీసుకొచ్చిన బ్యాచ్‌తో దందాలు, సెటిల్‌మెంట్లు చేసేవాడని ఇప్పుడు స్థానికంగా ఉన్న యువతను గ్యాంగ్‌లో చేర్చుకున్నాడని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వారితో ఇసుక, మద్యం, గ్రావెల్ వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు, దాడులు, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదు
గ్యాంగ్‌కు రాజేంద్రనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్ కేటాయించాడని, అక్కడ ఒంగోలుకు చెందిన కొంతమందితోపాటు స్థానిక గ్యాంగ్ సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటారని గుడివాడ ప్రజలు చెబుతున్నారు. బైపాస్‌రోడ్డుకు సమీపంలోని కార్యాలయాన్ని సెటిల్‌మెంట్లకు వాడుతున్నాడని, ఎవరినైనా అక్కడికే పిలిచి హెచ్చరిస్తాడని, తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే రాసిన వ్యక్తులపై బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపణలున్నాయి. పొరుగు నియోజకవర్గంలోని రీచ్‌ల నుంచి గుడివాడకు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో పార్టీ కార్యకర్తలకు వాటా ఇవ్వాలని అక్కడి నేతల్ని తులసి డిమాండ్ చేశాడు.
వారు అంగీకరించకపోవడంతో పోలీసుల్ని పంపి, లారీలను సీజ్ చేయించినట్టు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వాటా తీసుకుంటున్నాడని, నియోజకవర్గంలో ఏ పని చేసినా గుత్తేదారుల నుంచి కమీషన్లు దండుకుంటున్నాడని ఆరోపణలున్నాయి. అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి పనులు చేయించడం, నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పోస్టుల ఎంపిక, బదిలీలు, బెల్టుషాపుల ఏర్పాటు, వాటి నుంచి మామూళ్లు తీసుకోవడం వంటి ఆరోపణలున్నాయి.
పెట్రోల్ బదులు నీళ్లు!- వైఎస్సార్సీపీ నేత బంక్ ఎదుట వాహనదారుల ఆందోళన
ఏ అధికారి అయినా ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేను కలవాలంటే ముందుగా తులసి దర్శనం చేసుకోవాల్సిందేనన్న మాట వినిపిస్తోంది. అతను చెప్పాడంటే ఏ పనయినా క్షణాల్లో పూర్తిచేయాల్సిందేనని అంటున్నారు! బెదిరింపులు, అరాచకాలతో బీభత్సం సృష్టిస్తూ చెలరేగిపోతున్న తులసి ‘పనితనం’ మెచ్చి అన్ని ఆదాయమార్గాలపై పర్యవేక్షణ అతనికే అప్పగించారంటున్నారు. గుడివాడకు పక్కనే ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కొన్ని ‘లాభదాయక’ వ్యవహారాల్ని అతనికే ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చినట్టు తెలిసింది.
బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తులసి, ఆయన కుటుంబసభ్యులు పక్కా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు. ఆయన తండ్రి ఇప్పటికీ ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌తో తులసి అనుబంధం గాఢమైందగా చెబుతారు. వైఎస్సార్సీపీ హయాంలో అతను ఎక్కువ సమయం సునీల్ ఇంట్లోనే ఉండేవాడని ఆయన తరఫున ప్రైవేటు వ్యవహారాలు, దందాలన్నీ తులసే చక్కబెట్టేవాడనే ఫిర్యాదులున్నాయి. అప్పట్లో తులసి నిత్యం 30మందికి పైగా రౌడీమూకల్ని వెంటేసుకుని వాహనాల్లో తిరుగుతూ దాడులు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు తెగబడేవాడని చెబుతున్నారు.
ఏపీలో కొత్త స్టాక్ చూశారా! - గుడివాడ లిక్కర్ గోడౌన్లో సందడి
అడుగు తీసి అడుగు వేయాలంటే అధికారిక పోలీసు వాహనాలు సిద్ధంగా ఉండేవని, మొత్తం పోలీసు శాఖే తన జేబుల్లో ఉందన్నట్లుగా వ్యహరించేవాడన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో ‘దిశ’ పేరిట కేటాయించిన నిధుల దుర్వినియోగంతో పాటు సీఐడీలో బదిలీలు, పనిష్మెంట్లు ఎత్తివేయించడం, కీలకమైన కేసుల సెటిల్‌మెంట్లు చూడడం, భూకబ్జాల వంటి అక్రమ వ్యవహరాల్లో తులసిదే కీలక పాత్ర అని పోలీసుశాఖలో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట.
కాస్త ఆలస్యంగానైనా తులసిబాబుపై చర్యలకు ప్రభుత్వం పోలీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకి అనుచరుడైనా అరాచకంగా ప్రవర్తిస్తే ఎవరినీ సహించేది లేదంటూ దీని ద్వారా స్పష్టమైన సంకేతం పంపింది.
గుడివాడలో 'అన్న క్యాంటీన్' పునః ప్రారంభం - పేదలతో కలిసి సీఎం చంద్రబాబు దంపతుల భోజనం