Annamayya District Tomatoes Exports To Andaman : టమాటాల ధరలు పతనం కావడంతో కొన్ని ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనూ లాభాలు పొందవచ్చని అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన రైతు నిరూపించారు. టమాటాలను అండమాన్ దీవులకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ములకలచెరువుకు చెందిన మునీర్‌బాషా పదెకరాల్లో రూ.20 లక్షల ఖర్చుతో టమాటా సాగు చేశారు. పంట కోతదశకు వచ్చే సమయానికి ధరలు తగ్గడంతో అండమాన్ దీవులకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టారు. 500 బాక్సులు సిద్ధం చేసి చెన్నై ఓడ రేవు ద్వారా అండమాన్‌కు పంపారు.
రవాణాకు వారం రోజులు పడుతుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తుండడంతో అక్కడి వ్యాపారులు మునీర్‌ను ఆశ్రయిస్తున్నారు. నాణ్యమైన, దోరగా ఉండే టమాటాలను కోసి పంపుతున్నారు. రైతులు టమాటాలను స్థానిక మార్కెట్కు తరలిస్తే కూలీ, కమీషన్, రవాణా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అండమాన్‌కు ఎగుమతి చేసేందుకు ఇవేమీ అవసరం లేదని రైతు మునీర్ చెబుతున్నారు. అక్కడి వ్యాపారులే కూలీ, రవాణా ఖర్చులు చెల్లించి తీసుకెళ్తారని తెలిపారు. స్థానికంగా తోటల వద్ద 25 కిలోల బాక్సు ధర రూ. 200కు కొనుగోలు చేస్తున్నారు. అండమాన్ వ్యాపారులు రూ.450 చెల్లించి కొంటారని తెలిపారు. తోట వద్దే ఈ స్థాయిలో ధర రావడం లాభదాయకంగా ఉంది. ఏటా 50,000 బాక్సుల టమాటాలు ఎగుమతి చేస్తున్నట్లు రైతు తెలిపారు.
టమాటా ధర ఢమాల్ - కేజీ ఎంతో తెలుసా?
ఒకప్పుడు ఎర్రపండు రేంజే వేరు - కానీ ఇప్పుడు రైతన్నలకు కన్నీళ్లే!