Threat to Olive Ridley Turtles: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్ర తాబేళ్ల మరణాలు ఆగడం లేదు. ఒక్క జనవరి నెలలోనే ఏపీ తీరం వెంబడి 3,085 తాబేళ్ల కళేబరాలను గుర్తించినట్లు చెన్నై వేదికగా పనిచేస్తున్న ‘ట్రీ ఫౌండేషన్’ తన సర్వేలో పేర్కొంది. ఈ లెక్కలు కేవలం తీరానికి కొట్టుకువచ్చిన తాబేళ్లవి మాత్రమే. సంద్రంలోనే కలిసిపోయినవి మరెన్నో ఉండొచ్చు! ట్రీ ఫౌండేషన్ సంస్థ 2008 నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి తాబేళ్ల సంరక్షణకు పనిచేస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తాబేళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో ఓ సర్వే నిర్వహించింది. ఏటా ఈ సీజన్‌లో కొన్ని తాబేళ్లు మృతిచెందడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏపీ తీర జిల్లాల్లో పెద్దఎత్తున వందల తాబేళ్ల కళేబరాల్ని గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తాబేళ్లు సముద్ర జలాల అడుగున ఉంటున్నప్పటికీ, అవి 40 నిమిషాలకోసారి శ్వాసతీసుకునేందుకు ఉపరితలానికి వస్తుంటాయని తెలిపారు.
ఇలా వచ్చి తిరిగి వెళ్లే సమయంలో మత్స్యకారుల వలలకు, మోటారు బోట్లకు, మరికొన్ని కాలుష్యం కారణంగా మృతి చెందుతున్నాయని వెల్లడించారు. డిసెంబరు నుంచి మార్చి నెలల మధ్య గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు సముద్ర తీరానికి వస్తుంటాయని, అవి పెట్టిన గుడ్లు పిల్ల దశకు రావడానికి 48 నుంచి 60 రోజుల సమయం పడుతుందని అన్నారు. ఈ ప్రక్రియ కోసం వచ్చే తాబేళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయని తెలిపారు.
తీరంలో 'ఆలివ్ రిడ్లీ' కంట తడి - డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
అక్రమంగా వేట: భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరమని ట్రీ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు సుప్రజా ధారిణి తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కఠిన చట్టాల్ని అమలుచేస్తోందని, ఏపీ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీరం నుంచి 8 కిలో మీటర్ల అవతల చేపల వేట చేయాలని పేర్కొన్నారు. కానీ కొంతమంది మాత్రం అక్రమంగా వేట చేస్తున్నారని వివరించారు.
ముఖ్యంగా తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాలకు చెందిన మరబోట్లు అతిక్రమణలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు పలువురు ప్రమాదకర వలల్ని వాడుతున్నారని తెలిపారు. కోనా (గిల్ నెట్), అటుక, టేకు వలల ప్రభావంతో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు.
తీరానికి 8కిలో మీటర్ల అవతలే మరబోట్లతో చేపలు పట్టేలా, ప్రమాదకర వలలను నిషేధించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, సముద్ర తాబేళ్లను కాపాడాలని ట్రీ ఫౌండేషన్ సంస్థ కోరింది. వలలో చిక్కుకున్న తాబేళ్లు బయటికి వెళ్లేందుకు వీలుగా ఊచల్లాంటి ‘టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైజ్ (TED)’ వాడేలా చూడాలని ట్రీ ఫౌండేషన్ సూచించింది.
ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత - సంరక్షణపై అధికారుల అధ్యయనం
కాకినాడలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి - విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం