Serial Thefts in Narayanpet District : దొంగతనాలు అంటే ఒకప్పుడు చిమ్మ చీకట్లో జరిగేవి. ఏదైనా చోరీ జరిగినప్పుడు ఇది ఏ ముఠా పని అయి ఉంటుందో అన్న కోణంలో పోలీసులు విచారణ చేసేవారు. ఇటీవల పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం చోరీలు జరగడం పరిపాటిగా మారింది. మామూలు వ్యక్తులుగా సంచరిస్తూ, తాళం వేసిన ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇరుగు, పొరుగు వారికి కూడా అనుమానం రాని రీతిలో తాళాలను కోసేసి, తమ పనిని కానిచ్చేస్తున్నారు.
పట్టణాల్లో సాంకేతికత అందుబాటులోకి రావడంతో సులువుగా పట్టుబడతామని భావించి తెలివిగా గ్రామాలను టార్గెట్‌గా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవారి ఆర్థిక స్థితిగతులను ముందే అధ్యయనం చేస్తున్నారు. పల్లెల్లో సీసీ కెమెరాల వంటి సాంకేతికత ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం, జనం పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడంతో పట్టపగలు వారి పని సులభంగా అవుతోంది.
గతంలో జరిగే దొంగతనాలను చాలా వరకు మొబైల్ ఫోన్ల ఆధారంగానే కనుగొనేవారు. దొంగలు తెలివిగా సెల్ఫోన్లను వెంట తీసుకురాకుండా ద్విచక్రవాహనాలపై గ్రామాలకు చేరుకొని తమ పని (దొంగతనం) చేసుకుని ఉడాయిస్తున్నారు. చుట్టాల ఊరికి వచ్చినట్లు కలరింగ్ ఇస్తూ, ఎవరికీ అనుమానం రాకండా సంచరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దొంగలను పట్టుకోవడం పోలీసులకు కొంత సవాల్‌గానే మారింది.
దొంగతనం జరిగిన కొన్ని సంఘటనలు : మక్తల్ మండలంలో అశోక్‌రెడ్డి అనే వ్యక్తి ఇల్లు ఊరికి చివరన ఉంది. తాళం వేసి ఉండటంతో ఆ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. కాట్రేవ్‌పల్లి, మంథన్‌గోడ్ గ్రామాల్లోనూ ఈ తరహా చోరీలు జరిగి నగదు, నగలు అపహరణకు గురయ్యాయి. నారాయణపేట మండలం పెద్దజట్రంలో అదే రీతిలో జరిగింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో ఒకేరోజు మూడు ఇళ్లలోనూ చోరీలు జరిగాయి.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో ఏకంగా ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌కట్టర్‌తో కట్‌చేసి మరి నగదు దోపిడీ చేశారు.ఇటీవల కోస్గి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు రుణం కట్టేందుకు పేట వెళ్లారు. రూ.3లక్షలకు పైగా నగదు ఉన్న బ్యాగును కారులో పెట్టి రోడ్డుపై వాహనం నిలిపి బ్యాంకులోకి వెళ్లాడు. అప్పటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారును వెంబడించి అదును చూసి కారు అద్దాలు పగలగొట్టి ఆ నగదును అపహరించుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. సీసీ కెమెరాలో రికార్డు అయినా ఇంతవరకు నగదు, దొంగలు దొరకలేదు.
జనవరి నుంచి ఇప్పటి వరకు నారాయణపేట జిల్లాలో 97, మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 550 వరకు చోరీలు జరిగాయి. వాటిని విశ్లేషించినప్పుడు పట్టపగలు చేసిన దొంగతనాలే ఎక్కువగా జరగడం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పట్టపగలు తాళం వేయకుండా ఇంట్లో ఎవరినైనా ఉంచాలి. తప్పనిసరి వెళ్లాల్సివస్తే ఇరుగు, పొరుగువారికి చెప్పి వెళ్లాలి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఇంట్లో ఏదైనా అలికిడి జరిగేటప్పుడు సెల్‌ఫోన్‌కు సంకేతాలు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మార్కెట్‌లో అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విలువైన వస్తువులు, బంగారం వంటివి బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఉంచకపోవడం మంచిది. గ్రామంలో అపరిచితులు ఎవరైనా ప్రవేశిస్తే, వెంటనే సమాచారం అందరికీ చేరవేయాలి.
సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ - రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు