Brain Health Tips : మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు. సుమారు 1,400 గ్రాముల బరువు ఉంటుంది. ఒంట్లో ఏ భాగం స్పందించాలన్నా దాని అనుమతి తప్పనిసరి. అలాంటి భాగాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. దానిగురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారా? అంటే చాలామందికి అవగాహన ఉండటం లేదనే చెప్పాలి. పైగా మెదడును తన పని తాను చేసుకోనివ్వకుండా చెడు అలవాట్లతో నష్టపరుస్తున్నారు. వాటిని అలాగే కొనసాగిస్తే వయసు మీదపడే కొద్దీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నవే అనుకునే ఆ పనుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ న్యూరోసర్జన్, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఇడుపుగంటి, విజయవాడ జీజీహెచ్‌కు చెందిన న్యూరాలజీ వైద్యనిపుణులు డాక్టర్ ఇవాంజెలిన్ బ్లెస్సీ.
1) పునరుత్తేజానికి నిద్రే ఔషధం
7-8 గంటల విశ్రాంతి తప్పనిసరి : మెదడుకి నిద్రతో దగ్గరి సంబంధం ఉంది. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే జ్ఞాపకాలు పదిలంగా నిక్షిప్తమవుతాయి. 7 గంటలు నిద్రపోకపోతే జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుంది. ఏ విషయాన్నీ సరిగా గుర్తుంచుకోలేరు. దేనిపైనా ఏకాగ్రత కుదరదు. రోజంతా చికాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పెద్ద వయస్కులకు రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. అదీ రాత్రి సమయంలోనే నిద్రపోవాలి. అంతరాయం లేకుండా కనీసం 7 గంటలు నిద్రిస్తే మెదడే కాదు శరీర భాగాలన్నీ పునరుత్తేజం అవుతాయి. నిద్రలేమితో భవిష్యత్‌లో గుండెవ్యాధులు, హైపర్‌టెన్షన్, గుండెవ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ.
2) ఒత్తిడిని దరి చేరనివ్వద్దు
వ్యాయామమే శ్రీరామరక్ష : అనవసరమైన విషయాల్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుంది. తద్వారా మెదడులోని కణాలు చనిపోయే ప్రమాదముంది. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలామంది అనారోగ్యంగా ఉన్నా పనిలో నిమగ్నమైపోతారు. హెల్త్ బాగా లేనప్పుడు మెదడు దాన్ని తగ్గించే పనిలో బిజీగా ఉంటుంది. అందుకే ఒంట్లో బాగా లేనప్పుడు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తారు.
లేదంటే మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోవడమూ ఒత్తిడికి కారణం అవుతోంది. దీంతో ఊబకాయం, గుండెవ్యాధులే కాదు మెదడూ నిస్సత్తువగా మారుతుంది. నిత్యం వ్యాయామం చేస్తే చురుకుగా స్పందిస్తుంది. తదేకంగా కూర్చొని పనిచేసేవారు అరగంటకోసారి లేచి కొద్దిసేపు నడవాలి. వీలుచేసుకొని వారంలో కనీసం 3 రోజులైనా అరగంట చొప్పున నడవడం, జాగింగ్ చేయడం ఆరోగ్యకరం.
3) సెల్‌ఫోన్ స్క్రీనూ శత్రువే!
రోజులో 2 గంటలకు మించి చూడొద్దు : ప్రస్తుతం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. స్క్రీన్‌టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. తప్పనిసరిగా స్క్రీన్ ఎక్కువ చూడాల్సినవారు దాని నుంచి ఇబ్బంది కలగకుండా కళ్లద్దాలు పెట్టుకోవాలి. చిన్న పిల్లలు, యువత ఎక్కువసేపు సెల్ఫోన్లు వాడటం వల్ల ఆ కిరణాలు కంటిపై పడి తలనొప్పితో బాధపడతున్నారని వైద్యనిపుణులు హెచ్చరించారు. అదేవిధంగా ఫోన్ వాడేటప్పుడు 30 డిగ్రీల కంటే మించి తల కిందకు వంచకూడదు. మొబైల్ తెర ఎంతసేపు ఆన్‌లో ఉందని ఫోన్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్ అనే ఆప్షన్‌తో తెలుసుకోవచ్చు. తద్వారా మనం రోజూ మొబైల్ ఫోన్ ఎంతసేపు వాడుతున్నాం ఏ యాప్ ఎక్కువగా వినియోగిస్తున్నామనే విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు.
4) హెడ్‌ఫోన్లతో మోతే!
వాల్యూమ్ 60 శాతం మించొద్దు : డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం సురక్షిత స్థాయుల్లో శబ్దాలు వినకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది యువత వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. గంటసేపు పెద్ద శబ్దం పెట్టుకొని హెడ్‌ఫోన్లు, ఎయిర్‌పాడ్స్ వాడటం వల్ల బ్రెయిన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. హెడ్‌ఫోన్ల శబ్దాలు 60 శాతం కంటే ఎక్కువైతే మెదడు సాధారణ స్థితికి దూరమవుతుంది. మళ్లీ మామూలు స్థాయికి రావాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. పెద్దగా సౌండ్ పెట్టుకొని ధ్వనులు వినటం వల్ల క్రమంగా వినికిడి శక్తి కోల్పోయేలా చేస్తుంది. పెద్ద వయసులో వినికిడి సామర్థ్యం దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావడం చాలా కష్టం. ఇది కూడా నేరుగా బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
5) తియ్యనైన శత్రువు
రోజుకు 25 గ్రాముల కంటే తక్కువ చక్కెర మేలు! : తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ పనితీరు ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారంతోనూ ప్రతికూలతలు ఉంటాయి. ఫ్రక్టోజ్ స్థాయి ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. దీనివల్ల మధుమేహం, ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదముంది. కాలేయ క్యాన్సర్‌కు తియ్యటి పదార్థాలూ కారణమే. ఇలాంటి ఆహారాలు మెదడు ఆలోచనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. చురుకుదనం కోల్పోయేలా చేస్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం చక్కర స్థాయి ఎక్కువగా ఉండే పానీయాలను వారానికి 200-355 మిల్లీ లీటర్లు మాత్రమే తీసుకోవాలి.
మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది!
శవాసనం బెస్ట్ బ్రెయిన్ బూస్టర్! - నిపుణులు చెబుతున్న ఈ విషయాలు మీకు తెలుసా? - Shavasana Benefits