Godavari Level rising at Bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం గోదావరి నీటిమట్టం 44.1 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్ తెలిపారు. జాలరులు, పడవలు నడిపేవారు యాత్రికులు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇంకా నీటిమట్టం పెరిగితే పలు రహదారులకు వరద నీరు చేరే అవకాశం ఉంది.
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ నుంచి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు.
మరోవైపు ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తేరుకోకముందే ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనావేస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలిగి బాధితులు ఇంకా ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఖమ్మంలో పరిస్థితి ఇంకా సమాన్య స్థితికి రాకపోవడం, మరోవైపు ఎన్టీఆర్ జిల్లా బుడమేరుకు మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం స్థానికులను కలవరపెడుతోంది.