Supreme Court on Tirupati Laddu Adulteration : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి సీనియర్ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
సొలిసిటర్ జనరల్ అభిప్రాయం : అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. 'మొత్తం అంశాన్ని పరిశీలించాను. ఇది భక్తుల మనోభావాలకు చెందిన విషయమని. దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌పై ఎలాంటి సందేహాలు లేవు. అయితే స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కావున సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది.' అని న్యాయస్థానానికి తెలిపారు.
వివరాలు వెల్లడించని వైవీ సుబ్బారెడ్డి : పిటిషనర్లలో ఒకరైనా వైఎస్సాఆర్సీపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడం ధర్మాసనం అసంతృప్తి చెందింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని వ్యాఖ్యానించింది. ఇది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని, రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటుకు ధర్మాసనం విముఖత చూపింది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైఎస్సాఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేశ్ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.