Godavari Flood at Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు నదిలో నీటిమట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గి 49.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
48 అడుగులు దాడిన తరువాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. గత రెండు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
గోదావరిని పరిశీలించిన మంత్రి తుమ్మల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగు నీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరి కరకట్ట వద్ద వరద ఉద్ధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఏర్పడే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు పడిపోయిన, రోడ్లు పాడైన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. గోదావరిలో వరద 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉద్ధృతిని తెలియజేయాలని అధికారులకు సూచించారు.
గోదావరిలోకి నో ఎంట్రీ : గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. కళ్యాణ కట్ట వద్దకు వరద నీరు చేరడంతో భక్తులను నది వద్దకి అనుమతించడం లేదు. భద్రాచలం దిగువన ఉన్న రహదారుల పైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే వారిని తరలించేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
అత్యధిక వరద ఎప్పుడు వచ్చిందంటే : ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1986లో భద్రాద్రి వద్ద అత్యధిక వరద నమోదైంది. నదిలో నీటిమట్టం 75.60 అడుగులకు చేరింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. 2022 వరదల్లో ప్రవాహం 71.30 అడుగులుగా నమోదైంది. 21.78 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం - మహారాష్ట్రకు రాకపోకలు బంద్ - Godavari River Flow