IMD issued Yellow Alert : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా శాంతించిన భానుడు, మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రాగల మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నిప్పులకుంపటిగా తెలంగాణ - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - heat waves in telangana
Yellow Alert in Telangana : ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ వడగాలులు వీచనున్నట్లు ఐఎండీ తెలిపింది. గురువారం నుంచి కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు మూడు రోజుల పాటు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ద్రోణి ఒకటి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుండి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆ సమయంలో బయటకు రావద్దు : ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు గతంలో 2015, 16 సంవత్సరాల్లో నమోదయ్యాయి. ఆ రెండు సంవత్సరాల్లో ఎండల తీవ్రతకు అనేక మంది మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది.