SINGLE WINDOW POLICY PERMISSIONS : ఇల్లు కట్టుకోవాలన్నా, లే అవుట్లకు అనుమతులు కావాలన్నా ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. కూటమి ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా భవన నిర్మాణాలకు అన్నిరకాల అనుమతులు ఒకే పోర్టల్ నుంచి పొందే వెసులుబాటు కల్పిస్తోంది.
ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే
ఇక అన్నింటికీ ఒకే పోర్టల్
స్థిరాస్తి వ్యాపారానికి ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్సీపీ పాలనలో కుదేలైన భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేసింది. భవన నిర్మాణాలకు అన్నిరకాల అనుమతులు సింగిల్ విండో విధానం ద్వారా ఒకే పోర్టల్ నుంచి పొందే వెసులుబాటు కల్పిస్తోంది. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల హయాంలో పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా లేఅవుట్లు వెలిశాయి. స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణ యజమానులు, బిల్డర్లు అనుమతులు పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు తోడు లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చేది. అదనంగా కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులకు ప్లాట్లు సైతం కానుకలు అందజేయాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ రూపు మాపడం ద్వారా పారదర్శక సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేయడంతో నిర్మాణదారులు, లేఅవుట్ యజమానులకు కొండంత ఊరటగా చెప్పుకోవచ్చు. అనుమతుల కోసం పట్టణాల్లో కార్యాలయాలు చుట్టూ తిరిగే పనిలేకుండా పోయింది. ఆన్‌లైన్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రిమినల్ కేసులు
ఐదు అంతస్తుల భవనాలకు అనుమతులన్నీ ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వేయర్లే ఇవ్వనున్నారు. భవన నిర్మాణ ప్లాను దరఖాస్తును సర్వేయర్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి నిర్ణీత ఫీజు చెల్లిస్తే వెంటనే అనుమతులు వచ్చేస్తాయి. పునాది దశ నుంచి సర్వేయర్లే పూర్తి బాధ్యత వహించాలి. బిల్డర్లు ముందుగా పొందిన అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడితే పట్టణ ప్రణాళిక అధికారులు సర్వేయర్ లైసెన్సును రద్దు చేస్తారు. అదనంగా క్రిమినల్ కేసులు పెట్టేందుకు అవకాశం ఉంది.
'తిరుపతి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట జాతీయ రహదారులకు దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. దీంతో ఆయా పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అనేక కొత్త లేవుట్లు వెలిసి స్థిరాస్తి వ్యాపారం పెరిగింది. ఈ నేపథ్యంలో లే అవుట్లు, భవనాల అనుమతులకు కొత్త నిబంధనలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఆన్‌లైన్ ద్వారా కల్పించేలా ప్రభుత్వం అధికారులకు అవగాహన కల్పిస్తోంది' అని నాయుడుపేట కమిషనర్ ఫజులుల్లా తెలిపారు.
విదేశీ పర్యటకులను ఆకర్షించేలా ఏపీ టూరిజం పాలసీ
క్రీడాకారులకు ఇకపై పండగే - కొత్త క్రీడా విధానంతో ఎన్నో ప్రయోజనాలు