Electricity Departments Restored Power Supply : రెండు రోజులక్రితం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై కూలడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఆందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక విద్యుత్ శాఖ కార్యాలయాలకు నిరంతరం ఫోన్లు చేశారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.
'వాన కన్నా గాలి విపరీతంగా వచ్చి దాదాపు ఐదారు చెట్లు కూలాయి. అవి ఇళ్ల మీద, కరెంట్ తీగల మీద పడటంతో కరెంట్ స్తంభాలు నేలకూలాయి. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసింది. విద్యుత్ అధికారులు విరామం లేకుండా కరెంట్ పునరుద్ధరణకు కృషి చేశారు' - స్థానికులు
విద్యుత్ శాఖ ముందస్తు సన్నద్ధతతోనే : అర్థరాత్రి నుంచే పడిపోయిన వృక్షాలను డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని తొలగించేశారు. ఏఈలు, డీఈలు చొరవ చూపి క్రేన్లను తీసుకొచ్చి వీలైనంత త్వరగా విద్యుత్ స్తంభాలను అమర్చారు. వినియోగదారుల కోసం విద్యుత్ సిబ్బంది బాధ్యతగా అహర్నిశలు పని చేశారని స్థానికులు కితాబిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ముందస్తు సన్నద్ధతతోనే ఉంది. విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, సామగ్రిని అందుబాటులో ఉంచుకున్నారు.
రెండు రోజులక్రితం భారీవర్షం, గాలికి నేలకొరిగిన పదివేల పైచిలుకు విద్యుత్ స్తంభాల్లో దాదాపు 95 శాతానికి పైగా పునరుద్దరణ పనులు చేపట్టినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు సహా ఎల్టీ లైన్ల మరమ్మతులు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోనూ భారీ వృక్షాలు పడిపోయి, స్తంభాలు పడిపోగా విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడే ఉండి కరెంట్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌లో 640, ఖమ్మంలో 643, కొత్తగూడెంలో 519, నిర్మల్‌లో 403, నిజామాబాద్‌లో 389 విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్‌ను పునరుద్ధరించారు.
'గాలి, వానకు చాలా ప్రాంతాల్లో విధ్వంసమైంది. చెట్లు కూలడంతో వందల కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సుమారు 120 కరెంట్ స్తంభాలు ధ్వంసమైయ్యాయి. రాత్రి నుంచి విద్యుత్ సిబ్బంది అందరూ పనులు మొదలుపెట్టి కష్టపడ్డారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం'- ఆనంద్, రంగారెడ్డి సీజీఎం