TGPSC Group 2 Exam : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. పరీక్షా కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్ జరగ్గా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరగనున్నాయి.
ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలతో కూడిన ప్రత్యేక ఓఎంఆర్ షీట్లు అభ్యర్థులకు ఇచ్చారు. మొత్తం 783 పోస్టులకు 33 జిల్లాల్లోని 1,368 పరీక్షా కేంద్రాలు, 58 ప్రాంతీయ కేంద్రాలలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయి. నేడు, రేపు(ఆదివారం) పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లను చేసింది. పరోక్షంగా 75 వేల మంది వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. గ్రూప్-2 పరీక్షకు దాదాపు 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్ -2 పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్ : బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్ -2 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా ఏళ్ల తరవాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు. నాలుగుసార్లు వాయిదా పడ్డ తరవాత ఈసారి పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2కు హాజరయ్యాని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వివరించారు.
మార్చిలోపు నియామక పత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు : ఈసారి గ్రూప్ 2 ఫలితాలు చాలా వేగంగా ఇచ్చి మార్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మూడో పేపర్ , మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాలుగో పేపర్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని స్థాయిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని,జవాబు పత్రాలకు సంబంధించి 58 స్టోరేజీలో పాయింట్లు పెట్టినట్లు కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అఖిల భారత సర్వీసు యూపీఎస్‌సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం దిల్లీ పర్యటనకు వెళ్లనుంది.
మీరు గ్రూప్-2 ఎగ్జామ్ రాస్తున్నారా - ఇవి లేకపోతే పరీక్ష రాసేందుకు 'నో ఎంట్రీ'