Telangana University Engineering College Issue in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలోని డిచ్‌పల్లి వద్ద తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా, ఇంజినీరింగ్ కళాశాల మాత్రం అందుబాటులోకి రాలేదు. వర్సిటీలో భవనం నిర్మించినా కోర్సులు ప్రారంభించక నిరుపయోగంగా మారిపోయింది. ఏళ్లుగా ఇంజినీరింగ్ కళాశాల కోసం విద్యార్థులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నా, అందని ద్రాక్షగానే మిగులుతోంది.
జిల్లాలో ప్రైవేటులో ఒకట్రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. వ్యయప్రయాసాల నడుమ కోర్సు పూర్తి చేస్తున్న ఇక్కడి విద్యార్థులు, స్థానికంగా కళాశాల ఉంటే తమకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. దీంతో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
జిల్లాలో కలగానే మిగిలిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల : రాష్ట్రంలోని పది పాలిటెక్నిక్ కళాశాలలను ఉన్నతీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కళాశాలను ఉన్నతీకరించారు. పది కళాశాలల జాబితాలో నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. ఇక్కడ ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందింది.
తెలంగాణ వర్సిటీలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం భవనం అందుబాటులో ఉంది. ఇక్కడ కోర్సులు ప్రారంభించేందుకు వీలుంది. జేఎన్టీయూ సైతం కళాశాల ఏర్పాటుకు రెండేళ్ల కిందటే ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ వర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు అప్పట్లోనే అందించారు. ఇలా ఈ మూడు ప్రతిపాదనల్లో ఏదో ఒకదానికి ఆమోదం తెలిపితే ఇందూరు వాసులకు ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి రాని ఇంజినీరింగ్ కళాశాల : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నాటికి కళాశాల అందుబాటులోకి రావాలంటే పరిపాలన అనుమతులు తప్పనిసరి. అనుమతుల అనంతరం అధికారులు తరగతుల నిర్వహణ వసతులపై పరిశీలన చేసి నివేదిక అందించాల్సి ఉంటుంది. ఆపై బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించే కోర్సుల విషయంలో నిర్ణయం జరగాలి.
అనుమతుల విషయంలో ఆలస్యం జరిగితే మొదటి ఏడాదిలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు లేకుంటే, నాలుగేళ్ల కోర్సు నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేసి విద్యార్థులకు మేలు జరిగేలా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు.