Tenant Farmers Opposing CCRC Act 2019: 2019లో అధికారంలోకి రాగానే 2011 కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేశారు జగన్. ఎవరినీ సంప్రదించకుండానే పంటల సాగుదారుల హక్కు చట్టం-CCRCని (Crop Cultivator Rights Cards) తీసుకొచ్చారు. కొత్త చట్టంతో కౌలు రైతుల కష్టాలన్నీ తీరుతాయని ఊదరగొట్టారు. కానీ ఈ చట్టంతో రైతులకు నష్టమే తప్ప పైసా ఉపయోగం లేదు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో, గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోంది.
ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 24 లక్షలకు పైనే ఉంటుంది. వారిలో 10 శాతం మందికి కూడా రాయితీ పథకాలు, పంట రుణాలు అందలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటితోపాటు సాగు, ట్రాక్టర్, కోత మిషన్ కిరాయి ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను చుట్టుముట్టడటంతో చేతికొచ్చిన పంట పాడవుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా రాబడి లేదు.
మళ్లీ 'పొలం పిలుస్తోంది' పథకం- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్న - Achchennaidu Took Charge
2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం ఏపీ భూ అధీకృత రైతుల చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించేది. గ్రామ సభల్లో ధరఖాస్తులు స్వీకరించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. తద్వారా రైతులు పంట రుణాలు, ప్రభుత్వ రాయితీ పథకాలు పొందేవారు. 2014-19 మధ్య కాలంలో 1.55 లక్షల మంది కౌలు రైతుల ఖాతాలకు 123.57 కోట్లు రుణమాఫీ అయిందని గణాంకాలే చెబుతున్నాయి.
కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీసీఆర్‌సీ చట్టంలో ఉన్న లొసుగులను భూ యజమానులు ఆసరాగా తీసుకున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆఖరికి కౌలు రైతుల పేరున పంట నమోదు కూడా చేయనివ్వడం లేదు. కౌలు రైతులు.. రైతు భరోసా, పంట రుణాలు, బీమా వంటి రాయితీలు అందక తీవ్రంగా నష్టపోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన కౌలుదారీ చట్టంతో 32 లక్షల కౌలు రైతుల కుటుంబాల జీవనాధారం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం నుంచి సాయం రాక, అప్పులు పుట్టక, కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు నష్టాన్ని కల్గించే సీసీఆర్‌సీ చట్టాన్ని రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి విన్నవించారు. సీసీఆర్‌సీ చట్టాన్ని రద్దు చేయాలని గతంలో ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2011 ఏపీ భూ అధీకృత రైతుల చట్టాన్ని పునరుద్ధరించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.