Temporary Pause in Musi Residents Evacuation : మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదన్న సర్కార్ నిర్వాసితుల తరలింపు పనులకు తాత్కాలిక విరామిచ్చింది. పునరావాసం కింద బాధితులకు సమీపంలోని రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించింది. ఇప్పటివరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారినే తరలించిన సర్కారు దసరా తర్వాత ప్రక్షాళనను మరింత వేగంవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొన్నిచోట్ల ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి ఇళ్లకి అధికారులు తాళాలు వేయగా మరికొన్నిచోట్ల ఇళ్లను కూలీల సాయంతో నేలమట్టం చేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్‌ఘాట్ వద్ద ఉన్న శంకర్‌నగర్, రసూల్‌పురా, వినాయక వీధిలోని ఇళ్లు కూల్చేశారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల చొరవతో అక్కడి బాధిత కుటుంబాలు చాలావరకు ఇళ్లు ఖాళీ చేయగా చంచల్‌గూడ సమీపంలోని పిల్లిగుడిసెల గృహా సముదాయంలో వారికి పక్కా ఇళ్లు కేటాయించారు. స్వచ్ఛందంగా ముందుకొస్తే రవాణా ఖర్చులు, ఇతర సౌకర్యాల కోసం తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు జీవనోపాధి సహా చిన్నారులకు సమీపంలోనే పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
దసరా వరకు వారికి అవకాశం : రాజకీయంగా దుమారం పెరగడంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. రివర్ బెడ్‌లో మార్క్ చేసిన ఇళ్లలోని కుటుంబాలు ఖాళీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రాజకీయంగా ఇది మరింత చర్చనీయాంశం కావడంతో ప్రస్తుతం తరలింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా పక్కనపెట్టారు. బాధిత కుటుంబాల్లో ఎవరైనా నిరుపేదలు స్వచ్ఛందంగా ముందుకొస్తే వారికి అనుకూలంగా ఉండే ప్రదేశంలో పక్కా ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేచి చూసే ధోరణిలో ఉన్న వాళ్లతో రెవెన్యూ సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొందరు సమయం కోరగా దసరా వరకు అవకాశమిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దసరా తర్వాత మూడు జిల్లాల పరిధిలోని రివర్ బెడ్‌లోని కుటుంబాలను ఖచ్చితంగా ఖాళీ చేసి ఆ నివాసాలను కూల్చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అన్ని రకాల సాయం చేశాకే పునరావాసం : తొలిదశలో రివర్‌బెడ్‌లోని 2 వేలకుపైగా నిర్వాసితులను గుర్తించగా ఇప్పటివరకు 300 కుటుంబాలు మాత్రమే ఖాళీ చేశారు. మెహదీపట్నం, లంగర్‌హౌస్, బహదూర్‌పురాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో రెవెన్యూ అధికారులు అక్కడి ఇళ్లకు మార్క్ చేయకుండా వదిలేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసి బాధిత కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. వారిని ఒప్పించి పునరావాసం కింద అన్నిరకాల సాయం చేశాకే ఆ కుటుంబాలను ఖాళీ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో అనుకున్న ప్రణాళికను పక్కాగా అమలుచేసి రివర్ బెడ్‌లోని భూములను స్వాధీనం చేసుకొని ప్రక్షాళనను మరింత ముందుకు తీసుకెళ్లాలని సర్కారు భావిస్తోంది.
జీవనదిలా మూసీ - మంచినీటిని వదిలే ప్రాజెక్టు నిర్మాణం కోసం వారంలో టెండర్లు - Fresh Water Project
మూసీ నది ప్రక్షాళనలో మరో అడుగు - కూల్చివేతలు షురూ చేసిన అధికారులు - Demolitions at Shankar Nagar