Temple Lands Occupied in Hyderabad : హైదరాబాద్ పరిధిలో దేవాలయాల భూములకు రక్షణ కరవైంది. భూములపై నిఘా ఉండకపోవడం, కంచెలు వేసి హద్దులు గుర్తించకపోవడంతో అనేక భూములు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల ఖాళీ మైదానాల్లో తొలుత గుడిసెలు వేసి ఆక్రమించుకొని ఆ తర్వాత శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులతో సరిపెడుతున్నారు.
నిజాంకాలం నాటి రికార్డులే ఆధారం : పూర్వకాలంలో జాగీర్దారులు, పాలకులు, సాధారణ వ్యక్తులు దేవాలయాలకు భూముల్ని విరాళంగా ఇచ్చారు. వాటి వివరాలను నిజాం పాలకులు ప్రత్యేకంగా ముంతకబ్ రికార్డుల్లో భద్రపరిచారు. ఏ దేవాలయానికి ఎంత భూమి ఉందో తెలియాలంటే ఇదే కానీ 800కిపైగా దస్త్రాలు మాయమైనట్టు ఆరోపణలున్నాయి. మూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఎక్కడా భూములు అన్యాక్రాంతం (Temple Lands Encroachment) కాలేదని చెబుతున్నా నిజాం కాలంనాటి రికార్డులకు వీటికి పొంతన కుదరడం లేదని ఆలయాల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.
ఆలయ భూములను కూడా వదలని భూకబ్జాదారులు
58 మంది ఆక్రమణదారులు : హైదరాబాద్‌లో ఎండోమెంట్ ట్రైబ్యునల్‌లో నమోదైన కేసుల్లో 70 శాతం విచారణ పూర్తయి తీర్పులు వెలువడ్డాయి. 500కుపైగా కేసుల్లో స్వాధీనం చేసుకోవాలని ఆర్డర్లు వచ్చాయి. 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,100 కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,640 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. గత జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 83 కేసుల్లో తీర్పులు రాగా 58 మంది ఆక్రమణదారులను గుర్తించారు. 44 కేసుల్లో ఆధారాలు సరిగా లేవని వీగిపోయాయి. ట్రైబ్యునల్‌లో 460 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
నల్గొండ దేవాదాయ భూములపై రియల్ ఎస్టేట్ పంజా - అధికారులకు సైతం పట్టని భూ ఆక్రమణలు
జాగా కనిపిస్తే పాగా :
- లంగర్‌హౌజ్‌లోని శ్రీరామచంద్రస్వామి ఆలయానికి 26.36 ఎకరాలు ఉంది. కొందరు ఆక్రమణకు యత్నించగా వివాదం కోర్టులో ఉంది.
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయానికి భోలక్‌పూర్ సర్వే నంబర్ 92లో రూ.12 కోట్ల 1.34 ఎకరాలు ఉన్నట్లు నిజాం కాలంనాటి పత్రాలు చెబుతున్నాయి. కానీ దాన్ని గుర్తించడంలో అధికారులు చేతులెత్తేశారు.
- పహాడీ హనుమాన్ ఆలయ భూములు నాలుగున్నర ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇక్కడ ఓ కాలనీయే ఏర్పడింది. తక్షణమే ఖాళీ చేయాలంటూ దేవాదాయశాఖ నోటీసులు జారీ చేశారు. కానీ చివరకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో అధికారులు వెనక్కితగ్గారు.
- యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పేరిట మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో రూ.15 కోట్ల విలువైన 1.04 ఎకరాల స్థలం ఉంది. ఇది ఆక్రమణకు గురైనట్టు స్థానికులు ఎమార్వోకు ఫిర్యాదు చేశారు.
- తొర్రూరులో రంగనాథ స్వామి ఆలయానికి 8 ఎకరాలకుపైగా ఉంది. ఇవి కబ్జా కావడంతో ఆలయ కమిటీ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది.
- శాతంరాయిలోని కోదండ రామాలయానికి 70 ఎకరాలు ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ 7 ఎకరాలే మిగిలింది.
- కొందర్గు పెండాల లక్ష్మీనర్సింహ దేవాలయానికి 360 ఎకరాల భూములు (Temple Lands) ఉన్నాయి. ప్రస్తుతం 312 ఎకరాలే మిగిలింది.