Temple for Mother in Srikakulam District: అమ్మని మించిన దైవం లేదు. ఆత్మను మించిన అద్దం లేదు. జగమే పలికిన శాశ్వత సత్యమిది. అడిగితే వరాలిస్తాడని కోర్కెలు తీరుస్తాడనే నమ్మకంతో దేవుడికి గుడి కట్టి పూజలు చేస్తున్నాము. అలాంటిది అన్నింటా తానై, అడగకుండానే అన్నీ తీర్చే అమ్మకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకున్నా తక్కువే అవుతుంది. అయితే ఆ రుణంలో ఎంతో కొంత తీర్చుకోవాలనే తపనతో అమ్మ ప్రేమకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలసకు చెందిన సనపల శ్రావణ్‌కుమార్. దేవాలయమంటే సాదాసీదాగా ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా, ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుత మందిర నిర్మాణం చేపట్టారు.
సృష్టికి మూలం అమ్మ. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు. అలాంటి అమ్మకున్న ఉన్నత స్థానాన్ని, విలువను మరింత గొప్పగా చాటి చెబుతున్నారు సిక్కోలు జిల్లా చీమలవలసకు చెందిన సనపల శ్రావణ్ కుమార్. సనపల శ్రావణ్ కుమార్ తండ్రి కృష్ణారావు, తల్లి అనసూయ దేవి. వీరికి తొలుత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు పట్టిన వెంటనే చనిపోగా మరొకరు తన 9వ ఏట క్యాన్సర్‌తో మృతి చెందాడు. ఆ తర్వాత పుట్టిన శ్రావణ్ కుమార్‌ని తల్లి అల్లారుముద్దుగా పెంచింది. అలాంటి తల్లి 2008లో శస్త్రచికిత్స వికటించి మృతిచెందడంతో శ్రావణ్ కుమార్ తీవ్రంగా కుమిలిపోయారు.
హైదరాబాద్‌లో స్తిరాస్థి వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడిన శ్రావణ్‌కుమార్ తనకు తల్లిపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణపు పనుల్లో పాల్గొన్న స్తపతి బలగం చిరంజీవిని కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 2019 మార్చిలో సొంతూరు చీమలవలసలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ అమ్మ ఆలయ నిర్మాణానికి బాపట్ల జిల్లా మార్టూరు నుంచి కృష్ణ శిలలు తెప్పించినట్లు శ్రావణ్‌కుమార్ తెలిపారు. తమిళనాడు నుంచి శిల్పులను రప్పించినట్లు వివరించారు.
ఆలయం ఎన్నేళ్లయినా చెక్కుచెదురుగా ఉండకుండా, సిమెంట్‌తో కాకుండా రాతి భవనంతో నిర్మాణం చేస్తున్నామని శ్రావణ్‌కుమార్ తెలిపారు. తల్లి ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలనే తన కుమారుడు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారని శ్రావణ్ కుమార్ తండ్రి చెబుతున్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునాది నుంచి శిఖరం అంచుల వరకు నిర్మితమవుతున్న ఈ ఏకశిలా అమ్మ దేవస్థానం మరో రెండేళ్లలో పూర్తికానున్నట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు.
'మదర్స్ డే'ను ఆదివారమే ఎందుకు చేసుకుంటారు? దీని వెనుక ఇంత కథ ఉందా? - world mothers day date 2024