Vegetarian Traveler Visit 100 Countries Vey Soon : అతడో ఐటీ కన్సల్టింగ్ సంస్థ యజమాని. యాభై కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ. కానీ అవన్నీ పక్కన పెట్టి అమ్మ కోరికలు తీర్చడానికి ప్రపంచ యాత్రకు చేపట్టాడు. కేవలం ఏడాదిలోనే వంద దేశాలు చుట్టిరావాలని, అదీకూడా శాకాహార యాత్రికుడిగా తిరగాలని సంకల్పించుకున్నాడు. ఇప్పటికే 80 దేశాలు చుట్టేసి, మరికొద్ది రోజుల్లో 100 దేశాలు చుట్టిరావాలనే లక్ష్యాన్ని చేరుకున్న మొదటి శాకాహార ప్రపంచ యాత్రికుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ఆ యువకుడే జనగాం జిల్లాకు చెందిన గందె రామకృష్ణ. ప్రయాణం మొదటి నుంచి ఎదురైన అనుభూతులు, చేదు అనుభవాలను పంచుకున్నాడు.
మాది జనగామ. నా వయసు పది నెలలు అప్పుడు అమ్మ నడవలేని స్థితికి చేరింది. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అమ్మమ్మగారి ఇంట్లో పెరిగా, ఇష్టంగా చదివా, అన్నింట్లో ఫస్టుగా, కూచిపూడి నేర్చుకున్నా, నాలుగేళ్లు కరాటేలో శిక్షణ తీసుకొని బ్లాక్‌బెల్ట్ సాధించా, డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చేశాను. అప్పుడు ఒకవైపు అమ్మను చూసుకుంటూ మరోవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ సైకిల్‌పై కాలేజీకి వెళ్లొచ్చేవాడిని. కొద్ది సమయం దొరికితే చిన్న రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడిని. ఈ సమయంలో నా జీవితం దుర్భరంగా ఉండేది. చదువు పూర్తైన వెంటనే ఉద్యోగం వచ్చి కొన్నేళ్లు విదేశాల్లోనూ పని చేశాను. ఎనిమిదేళ్ల కిందట అమెరికాలో సొంత ఐటీ కన్సల్టింగ్ సంస్థని ప్రారంభించాను ప్రస్తుతం దాని టర్నోవర్ రూ.50 కోట్లుగా ఉంది. పదుల మందికి ఉపాధిని అందిస్తున్నారు.
అమ్మ కలలు నిజం చేయడానికి : ప్రశాంతమైన జీవితంతో పాటు డబ్బుకి ఇబ్బంది లేకపోవడంతో అమ్మ కన్న కలలు, ఆశయాలను నెరవేర్చాలని అనున్నాను. అందుకు ఏడాది కిందట 'RK World Traveller' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాను. ఈ ఛానెల్లో నేను ప్రపంచం చుట్టి రావాలని అనుకున్నాను. ఈ ప్రపంచాన్ని చూస్తూ, నేను చూసిన ప్రపంచాన్ని తెలుగింట వాళ్లందరికీ పరిచయం చేస్తున్నాను. ఇప్పటివరకు 350 వీడియోలు అప్లోడ్ చేశాను. గత టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ జరిగినప్పుడు కరీబియనన్ దేశంలో ఉండి పలు మ్యాచ్‌ల విశేషాలు, ఆస్ట్రేలియా జట్టు సభ్యుులతో చిట్చాట్లు అందించాను. ప్రతి దేశంలో అక్కడి వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు, ప్రమాదకర పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు వీడియోలుుగా చిత్రీకరించి ఛానెల్లో అప్లోడ్ చేస్తాను. ఈ పర్యటనల్లో మంచి అనుభూతులు, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వంద దేశాలు తిరిగిన మొదటి వెజిటేరియన్ ట్రావెలర్ రికార్డుకు కాస్త దగ్గరలోనే ఉన్నాను.
మంచి అనుభవం : గాడలూప్, మార్టినా ఫ్రాంకా, సెయింట్ బార్తల్మే దేశాల్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిని నేనే.
చేదు అనుభవం : చిన్న కారణంతో డొమినిక్ రిపబ్లిక్ విమానాశ్రయంలో 13 గంటలపాటు నన్ను ఆపారు. ఒకదేశం వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితుల ఇబ్బందుల కారణంగా ఎక్కాల్సిన విమానం రద్దు అయింది. ఆ తర్వా ప్రోగ్రాం మార్చి ఫ్రాన్స్ వెళ్లాను. మరోచోట కొందరు ఇమ్మిగ్రేషన్ అధికారులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.
ఆ స్ఫూర్తితోనే ముందడుగు : అమ్మ జ్యోతికి 108 కథలు రాసిన శత కథా రచయిత్రిగా పేరుంది. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆమె వెన్నెముక విరిగి చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఇలాంటి కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాన్న వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడు. ఆమె చక్రాల కుర్చీలో ఉంటూనే రచనలు సాగించింది. అప్పుడే ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఆ కథలను అప్లోడ్ చేయాలనేది ఆమె ఆశ. అలాగే ప్రపంచమంతా పర్యటించాలని కోరిక. ఆ కోరికను తీర్చడానికి దేశంలోని ప్రముఖ సందర్శనీయ స్థలాలన్నీ టెంపో ట్రావెలర్‌లో తిప్పి చూపించా. విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకొని ప్రయత్నాల్లో ఆమె కన్నుమూశారు. ఆ రెండు కోరికలూ నెరవేర్చడానికి ఇలా ట్రావెల్ అవతారం ఎత్తాను. అందుకే ఏదేమైనా లక్ష్యం చేరేదాకా నా ప్రయాణం ఆగదు.
బైక్‌పై మినీ కిచెన్.. ఫుడ్ అమ్ముతూ సోలో రైడ్స్.. మూడు దేశాల్లో రయ్రయ్