Telangana young Lady Participate in the National Adventure Camp : ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల పరిస్థితులు, అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి బయటపడటంతో పాటు తోటివారిని రక్షించేలా వాలంటీర్లను తీర్చిదిద్దడం ఎన్‌ఎస్‌ఎస్ ఉద్దేశం. కులు-మనాలిలోని అటల్ బిహారి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినరింగ్ అలైడ్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రంలో జాతీయ సాహస శిబిరం నిర్వహిస్తారు. ఇలా శిక్షణ తీసుకుని సాహస శిక్షణ శిబిరాలలో పాల్గొంటుంది నిర్మల్ జిల్లా యువతి.
నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగి అనే గ్రామానికి చెందిన యువతి దీపిక. తల్లిదండ్రులు నవతే లక్ష్మి, భోజరాం వ్యవసాయం చేస్తుంటారు. దీపిక చిన్నప్పటి నుంచి అన్ని అంశాల్లోనూ చురుకుగా ఉండేది. చదువుతో పాటు సామాజిక సేవా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ బీజెడ్సీ కోర్సులో చేరారు. ద్వితీయ సంవత్సరంలో ఎన్ఎస్ఎస్‌లో చేరి సిర్పూర్‌లో జరిగిన శిబిరంలో ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించడంలో భాగస్వామ్యమైంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో సాహస శిక్షణ శిబిరానికి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి దీపిక మాత్రమే ఎంపికైంది.
National Adventure Camp Nizamabad Young Woman : ఈ ఏడాది జనవరి 3 నుంచి 12 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మెక్లోడ్ గంజ్‌లో జరిగిన శిక్షణ శిబిరంలో దీపికతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. రాక్ క్లైం బింగ్, ఆర్టిఫిషియల్ రాక్ క్లైంబింగ్, తాడుపై నడిచి నదిని క్రాస్ చేయడం, సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతో తనదైన ప్రత్యేకతను చాటింది. భూమట్టానికి 2,875 మీటర్ల ఎత్తయిన ట్రయింట్ పర్వతాన్ని అధిరోహించి అధికారుల అభినందనలు అందుకున్నారు.
భవిష్యత్తులో ఎత్తైన అన్ని పర్వతాలను అధిరోహించాలి : చిన్నప్పటి నుంచి సాహసం చేయడం ఇష్టమని దీపిక అంటోంది. ఏ పని చేసినా అమ్మనాన్నలు ప్రోత్సహించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన శిబిరంలో అవకాశం రావడంతో సత్తా చాటే అవకాశం వచ్చిందని భావించింది. దీపికకు అవకాశం రావడంలో కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకురాలు సునీత కృషి చేశారు. శిబిరంలో శిక్షకులు జితేందర్, సోనం, శ్యాం, గగన్‌లు అన్ని విషయాల్లో అవగాహన కల్పించారు. భవిష్యత్తులో బీపీఈడీ చేసి వ్యాయామ ఉపాధ్యా యురాలిగా చేరి అమ్మాయిలను క్రీడాకారిణులుగా తీర్చిదిద్దాలని దీపిక లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఎత్తైన అన్ని పర్వతాలను అధిరోహించడమే తన లక్ష్యమని దీపిక అంటుంది. ఈ క్రమంలో ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
"తెలంగాణ యూనివర్సిటీ నుంచి 10 మంది సెలెక్టు అయ్యారు. దానిలో నిజామాబాద్ గిరిరాజ్ గవర్నమెంటు కళాశాల నుంచి నేను ఎంపిక అయ్యాను. రన్నింగ్, ఎత్తు వంటివి చూసి ఎంపిక జరిగింది. నా తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహం అందించారు. అలాగే మా ఎన్‌ఎస్‌ఎస్ స్టాఫ్, నాకు శిక్షణ ఇచ్చినవారు చాలా సహాయం చేశారు. ప్రిన్సిపల్ సార్, తెలుగు సార్ కూడా ప్రోత్సాహం అందించారు. ఎత్తైన పర్వతాలు అన్ని అధిరోహించాలని నా లక్ష్యం." - దీపిక, పర్వతారోహకురాలు
కళ్లు లేకున్నా కలలు సాకారం- చదువులో రాణిస్తున్న లక్కీ మిరానీ సక్సెస్ స్టోరీ - Lucky Mirani story