Telangana Thalli New Statue Photos Viral : తెలంగాణ తల్లిరూపంపై సస్పెన్స్ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహనమూనా బహిర్గతమైంది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్ నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు దిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న వరి సజ్జలున్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
రూ.5.30 కోట్ల వ్యయంతో తెలంగాణ తల్లి విగ్రహం : జవహర్‌లాల్ నెహ్రూ ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఆ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్యవిగ్రహాన్ని తయారుచేసింది. 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేసింది. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయం ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కిందిగద్దె మరో మూడు అడుగులతో రూపొందించారు. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటెన్ పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా : రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. కాగా విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ఇప్పటికే వెల్లడించారు. ఈ వేడుకలు సచివాలయంలోని కార్యాలయాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం ఉంది.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: సీఎం రేవంత్‌రెడ్డి - Telangana Talli Celebrations 2024