Telangana Budget 2024-25 In Assembly Today : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత : లోక్‌సభ ఎన్నికలకు ముందు నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌కు అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు పూర్తి పద్దును ప్రతిపాదించింది. బడ్జెట్‌లోని నిర్వహణ పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా, ప్రగతి పద్దులో మాత్రమే కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది.
సొంత ఆదాయంతోనే : కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అన్నది కూడా దాదాపుగా తేలిపోయింది. గతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉంది. పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3 వేల కోట్లు, ఓటాన్ అకౌంట్‌తో పోలిస్తే 577 కోట్లు అదనంగా రానున్నాయి. వీటిని మినహాయిస్తే కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన ఏవీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండబోవని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాల పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆరు గ్యారంటీలకు కేటాయింపులు : వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దుల ప్రతిపాదన విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తూ ఆయా శాఖల పద్దుల విషయంలో ఓ అంచనాకు వచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53 వేల 196 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కేవలం ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. విధివిధానాలు తయారైన వెంటనే అమలుకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రైతు భరోసా పథకానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. చేయూత పథకం కింద పింఛన్ల కోసం 14 వేల 800 కోట్లు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్‌లో 7వేల 740 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయల ఆర్థికసాయం కోసం 7 వేల 230 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 4 వేల 84 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం సుమారు రూ. 2,418 కోట్ల ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం బడ్జెట్ లో 723 కోట్ల రూపాయాలు ప్రాథమికంగా కేటాయించారు.
రుణమాఫీ కోసం 31 వేల కోట్లు : కొత్త ఉద్యోగ నియామకాల కోసం వెయ్యి కోట్లు కేటాయించింది. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ సమయంలో బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. రుణమాఫీ కోసం 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఇప్పటికే లక్ష వరకు 6 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఇప్పటికే మాఫీ చేశారు. ఆగస్టు 15 లోపు మిగతా రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి.
రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ చేసింది. గ్యారెంటీలకు ఓటాన్ అకౌంట్‌లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే పూర్తి స్థాయి బడ్జెట్‌లో పెరగనుంది. ఇటీవల ఇచ్చిన హామీలు, సర్కార్ చేపట్టిన చర్యలకు తగ్గట్లుగా పూర్తి స్థాయి బడ్జెట్ పద్దు ఉండనుంది. మెట్రో రైల్ పొడిగింపు, మూసీ నదీ ప్రక్షాళన అభివృద్ధి, స్కిల్ యూనివర్శిటీ తదితర కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించింది.
విద్య, వైద్య రంగాలకు : అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయ రంగానికే 50 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖకు 30 వేల కోట్ల వరకు, సంక్షేమ రంగానికి 40 వేల కోట్ల వరకు, విద్య, వైద్య రంగాలకు పది వేల కోట్లకు పైగా పద్దు ఉండవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో నెల పూర్తి కావస్తోంది. మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం, ఇతరత్రా నిధులు, కేంద్ర నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు, నిధులను పరిగణనలోకి తీసుకొని పద్దు ఖరారు చేశారు.
బడ్జెట్ పద్దు కాస్తా పెరిగే అవకాశం : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పద్దును 2 లక్షల 75 వేల 890 కోట్లుగా ప్రతిపాదించారు. పూర్తి స్థాయి బడ్జెట్ పద్దు కాస్తా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్యారంటీలు సహా ఇతరాలకు నిధులు పెరగడంతో పద్దు పెరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పదేపదే చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ పద్దు ఉండనుంది.
పూర్తి స్థాయి బడ్జెట్ పద్దు రెండు లక్షల 90 వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో శాఖల వారీ పద్దులు లేవు. పూర్తి స్థాయి బడ్జెట్ లో శాఖల వారీ పద్దులు కూడా ఉండనున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రక్రియ పూర్తికాగానే ఉభయ సభలు ఈనెల 27వ తేదీకి వాయిదా పడతాయి. ఆ తర్వాత ఆదివారం మినహా వచ్చే నెల రెండో తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.