Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గవర్నర్ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉండనుంది. ఈ నెల 25వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి బడ్జెట్‌కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఈనెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వనుంది. నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌తో పాటు ధరణి, రైతుభరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
వారం క్రితమే సమావేశాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష : ఈనెల 11వ తేదీన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో అసెంబ్లీ సమావేశాల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చించారు. ఇప్పుడు రైతు రుణమాఫీ రూ.30 వేల కోట్లతో ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో నేడు రుణమాఫీ నిధులు మొదటి విడతగా రూ.7వేల కోట్లను రూ.1.50 లక్షల కంటే తక్కువ మాఫీ ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదు : సీఎం రేవంత్ రెడ్డి