Sports Authority Chairman Comments On HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అండర్ 19 సెలక్షన్ విషయంలో హెచ్‌సీఏపై తమకు పలు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై తాము లిఖిత పూర్వక నివేదిక కోరినట్లుగా వివరించారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు నందిస్తుందని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'ది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్'(టిడిసిఏ) కార్యక్రమంలో టీడీసీఏ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , పలువురు క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తిగల వారికి ప్రోత్సాహమందిస్తాం : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ క్రీడాకారులకు రాష్ట్రం, దేశం తరపున ప్రాతినిధ్యం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంచి అలోచనతో ముందుకు వచ్చిన అల్లీపురం వెంకటేశ్వరెడ్డిని శివసేనా రెడ్డి అభినందించారు. తెలంగాణలో క్రీడలపై ఎవరు శ్రద్ధ చూపినా ప్రభుత్వం తోడ్పాటు అందింస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. త్వరలో సీఎం కప్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు.
TDCA Chairman Comments On HCA : నూతనంగా ప్రారంభించిన టీడీసీఏ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని హెచ్‌సీఏ ఇష్టానుసారంగా సెలక్షన్స్ జరుపుతోందని టీడీసీఏ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరెడ్డి అన్నారు. తెలంగాణకి చెందిన క్రికెటర్లు అమెరికా టీమ్స్‌కు కెప్టెన్లు అవుతుంటే ఇక్కడ మాత్రం ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్‌ను క్రీడలు నిర్వహిస్తాం. గ్రామస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడలను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నాం. తెలంగాణ నుంచి ఉత్తమ క్రికెటర్లను తీర్చిదిద్దేవిధంగా ముందుకు వెళ్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై కొన్ని ఫిర్యాదులు మా దృష్టికి కూడా వచ్చాయి. అండర్ 19 సెలక్షన్లను దేని ప్రామాణికంగా చేశారు? ఆ ప్రక్రియలో ఎక్కడైనా తప్పిదాలు జరిగాయా? జరగలేదా? జిల్లా స్థాయిలో ఒక్కరిని కూడా తీసుకోలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. హెచ్‌సీఏ నుంచి నివేదిక కోరతాం. రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం" - శివసేనా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్