KTR SLAMS CONGRESS : కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్ర పదవులు తెలంగాణేతరులకు ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేశవరావు స్థానంలో రాజ్యసభ పదవిని వీహెచ్‌కు ఇవ్వవచ్చు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చెబుతున్నట్లు తెలంగాణ గురించి పార్లమెంట్లో అభిషేక్ సింఘ్వీ మాట్లాడితే, మిగతా ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
గ్రామస్థాయిలో కార్యక్రమాలు : మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని, రాజ్యసభ స్థానం అయినా ఇవ్వవచ్చు కదా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజయం 20వ సారి దిల్లీకి పోవడం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. గత పర్యటనలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేతలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. రుణమాఫీ విషయంలో తదుపరి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు : రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, భట్టి చెప్పినట్లు రూ.7500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని ఆయన తెలిపారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్పని, కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఒక విడత రైతుబంధు మాత్రమే జమ చేశారని తెలిపారు.
డిక్లరేషన్లపై పోరాటం : రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేరని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సర్కార్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని దుయ్యబట్టారు. కుల గణన చెకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే పరిస్థితి లేదని, ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ తర్వాత ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లపై పోరాటం చేస్తామని, కాంగ్రెస్ డిక్లరేషన్ల సభలు పెట్టిన చోటే తాము సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
అదానీపై విచారణ చేయాలి : అదానీ విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తేడాలు ఉన్నాయని, వాటిపై తమకు స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అదానీ విషయంలో సుప్రీంకోర్టు లేదా జేపీసీ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. తనకైనా, రేవంత్ రెడ్డికి అయినా తెలంగాణ తల్లి ఒకటేనని కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లు, రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటే అంత దుర్మార్గంగా ఉంటుందని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతల పేర్లు ఎక్కడున్నాయో అన్నింటినీ మారుస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గుర్తులు చెరిపేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రం పేరు మార్చాలని సూచించారు. కేసీఆర్ తమకు ట్రంప్ కార్డు అన్న కేటీఆర్, అవసరం ఉన్నప్పుడు ప్రజల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు.