Telangana Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు ఎండలు, వడగాలులు, చెమటతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన జనం.. వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారడంతో ఎంతో సంతోషిస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచే పలు చోట్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి మొదలయ్యాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.
మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ :
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కొన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు బలంగా వీచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
అకాల వర్షాలతో రైతులకు నష్టం..
మరో వైపు ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చేతికొచ్చిన పంట పొలంలోనే నీళ్లపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయిందని వాపోతున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల మామిడి, నిమ్మ వంటి పంటలు నేల రాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ధాన్యం ముక్కిపోయే అవకాశం ఉందని ఆందోళ చెందుతున్న అన్నదాతలు.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.