Police Overaction in Lok Sabha Election Inspections : ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచితాల పంపిణీ విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో పోలీసుల నిఘా కచ్చితంగా వీటిపై ఉండాల్సిందే. కానీ కొందరు పోలీసు సిబ్బంది తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. రోజూ లక్షల్లో వ్యాపారం జరిగే దుకాణాలకు సాయంత్రం తర్వాత కొద్ది దూరంలో పోలీసులు మాటేస్తున్నారు. వ్యాపారులు దుకాణం మూసేసి బయటకురాగానే ఆ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. వ్యాపారులు తాము సంపాదించిన డబ్బు దుకాణాల్లో వదిలిపెడితే చోరీలు జరుగుతాయోమోననే భయంతో డబ్బు మొత్తం ఇంటికి తీసుకెళుతున్నామని అంటున్నారు. వీటికి బిల్లులు, పత్రాలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.
ఇంట్లో దాచేందుకు తీసుకెళ్తుంటే దుకాణాలకు కొద్ది దూరంలో మాటేస్తున్న కొందరు పోలీసులు, ఇలా నగదు స్వాధీనం చేసుకుని లెక్కలు చూపించాలని కోరడం ఇబ్బందిగా మారుతోందని వ్యాపారులు వాపోతున్నారు. నగదు బ్యాంకుల్లో జమ చేసేందుకు వెళ్లే సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు ఏటీఎంలకు నగదు తరలించే వాహనాల సిబ్బందికి ఈ తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాహనం, బ్యాంకు సిబ్బంది సరైన పత్రాలు తెప్పించి చూపేలోపు నగదు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుపుతున్నారు. బ్యాంకు అధికారులు వాటి వివరాలను సమర్పించగానే వదిలేస్తున్నారు. ఇటీవల కేపీహెచ్బీలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఏటీఎంలకు నగదు తరలించే వాహనం నుంచి రూ.25.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులు కొన్ని గంటల తర్వాత సరైన పత్రాలు చూపించగానే వదిలేశారు.
మద్యం, వస్త్ర, ఎలక్ట్రికల్, గృహ నిర్మాణ సామగ్రి, ఇతర దుకాణాల వ్యాపారం రోజూ లక్షల్లో జరుగుతుంది. చోరీల భయంతో కౌంటర్‌కు వచ్చే డబ్బు రాత్రి వేళ దుకాణంలోనే వదిలేయలేని పరిస్థితి ఉంటుంది. మెజార్టీ వ్యాపారులు నగదు తమతో పాటే తీసుకెళ్తారు. మరుసటిరోజు బ్యాంకుల్లో జమ చేయడం లేదా సామగ్రి కొనుగోలు చేసినందుకు చెల్లింపులు చేయడం వంటివి జరుగుతుంటాయి.
ఉదాహరణ : ఈనెల 28వ తేదీన పాతబస్తీలో ఓ మద్యం దుకాణం నిర్వాహకుడు రాత్రి 11 గంటలకు వ్యాపారం ముగిశాక, కౌంటర్లోని డబ్బుని ఇంటికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. దుకాణం మూసేసి రోడ్డు దాటాడో లేదో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. అతని దగ్గర ఉన్న రూ.8.7 లక్షల నగదుకు లెక్కలు చూపించమని అడిగారు. రోజంతా దుకాణంలో మద్యం అమ్మగా వచ్చిన డబ్బు ఇదని, బిల్లులు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పారు. అయితే సరైన పత్రాలు చూపించాకే నగదు తీసుకెళ్లాలంటూ ఓ రశీదు చేతిలో పెట్టి వెళ్లిపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలంగాణ లోక్‌సభ బరిలో 525 మంది - ఈనెల 5 నుంచి హోమ్ ఓటింగ్ : వికాస్ రాజ్
డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లపై ఎందుకు ఈడీ, ఐటీ విచారణకు పీఎం మోదీ ఆదేశించడం లేదు : కేసీఆర్