TPCC Chief Mahesh Kumar Goud On District Wise Reviews : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఆయన పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతిరోజూ అటు గాంధీ భవన్, ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు వస్తున్నారు.
అదేవిధంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీలో సీనియర్ నాయకులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. మరోవైపు గడిచిన రెండు రోజులుగా తరచూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీకి చెందిన పలు అంశాలను చర్చించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు.
నేటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలకు సిద్ధమైన పీసీసీ చీఫ్ : గాంధీభవన్‌లో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమీక్షలు నిర్వహిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులతో పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారు. ఇవాళ్టి నుంచి మొదలు కానున్న ఉమ్మడి జిల్లాల సమీక్షలు వారం, విడిచి వారం కొనసాగుతాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ జిల్లాల వారిగా గాంధీ భవన్‌లో జరగనున్న పీసీసీ సమీక్షలో ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, సంబంధిత ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాద్‌లు కూడా పాల్గొంటారు.
అదేవిధంగా ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంఛార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు పీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఫ్రంటల్ ఛైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొంటారు. మొదట ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి.