New Teachers Posting Completed in Telangana : డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లు మూడు గంటలపాటు ఆందోళన పడినా ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ నిర్వహించి ఏ పాఠశాలలో పనిచేయాలో సూచిస్తూ పోస్టింగ్‌లు కేటాయించారు. 10వేల 6 మంది పోస్టింగ్‌లు పొందారు. వారంతా ఇవాళ కేటాయించిన పాఠశాలల్లో చేరారు. దాదాపు 80 శాతం మంది ఎస్జీటీలకు సొంత మండలాల్లోనే పోస్టింగ్‌లు దక్కాయని సమాచారం. గతంలో బదిలీ అయి రిలీవ్ కాని వారు మంగళవారం మధ్యాహ్నమే పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యారు. వారూ ఇవాళే కొత్త బడుల్లో చేరారు.
ఈ నెల 9న నియామకపత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకు 15న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించాలని 14న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎంపికైన వారందరూ మంగళవారం ఉదయం 8.30 గంటలకే కలెక్టరేట్లకు చేరుకున్నారు. సాయంత్రం వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని ఉదయం 9 గంటలకు పాఠశాల విద్యాశాఖ నుంచి డీఈఓలకు ఆదేశాలు అందాయి. దాంతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. అసలెందుకు నిలుపుదల చేయమన్నారో తెలియక ఆందోళన చెందారు. మధ్యాహ్నం 12కు మళ్లీ కౌన్సెలింగ్‌ను యథాతథంగా కొనసాగించాలని ఉత్తర్వులివ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌తో సజావుగా పోస్టింగ్‌లు : కొత్త టీచర్ల కంటే ముందుగా తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని 317 జీఓ బాధిత ఉపాధ్యాయుల డిమాండ్‌తోనే సమస్య ఎదురైంది. ఈ విషయంపై కొందరు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు కొత్త వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుంటే 10 వేల మందికి పనిలేకుండానే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఏడు వేల మంది సీనియర్ ఉపాధ్యాయులు రిలీవ్ చేయాలని మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
సుమారు 500 మంది 317 జీఓ బాధితుల కోసం వేల మందిని ఆపితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు భావించారు. దీనికితోడు ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని డీఎస్సీ-2024లో ఎంపికకాని వారు కోర్టుకు వెళ్తే ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని అధికారులు భావించారు. 317 జీఓ బాధితుల బదిలీల ప్రక్రియ ఒకటీ రెండు రోజుల్లో పూర్తయే పరిస్థితి లేదు. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లడంతో సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన, వెంటనే కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు.
క్రీడా కోటా కింద 393 మంది దరఖాస్తులు : ఎంపికైన ఉపాధ్యాయుల్లో ఓసీలు 5.5 శాతం ఉన్నారు. అత్యధికంగా బీసీలు 54.70 శాతం మంది ఎంపికయ్యారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎస్సీలు-18.5 శాతం, ఎస్టీలు 10.3 శాతం మందికి టీచర్ల కొలువులు దక్కాయి. క్రీడా కోటా కింద 393 మంది దరఖాస్తులను శాప్‌నకు పంపామని, అనుమతి మేరకు 33 మందికే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన వాటిపై అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇస్తామని పేర్కొన్నారు.