Telangana Ministers Review Meeting on Irrigation Deportment : రాష్ట్రంలోని సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని, స్వతంత్ర భారతదేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారని, రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణాలపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
Minister Uttam Kumar Review Meeting : 2014లో మరో రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే సీతారామ ప్రాజెక్టు పదేళ్లు అయినా పూర్తి కాలేదని, దీనికోసం రూ.7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారని ఉత్తమ్ పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.18,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. 3 లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్లు అప్పుడే వచ్చేదని, కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో మంత్రుల బృందం సీతారామ సాగర్‌ను పర్యటిస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పనులపై రోజు రోజుకు బయట పడుతున్న వివరాలను చూస్తే దిగ్భ్రాంతి చెందుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కేబినెట్లో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటమన్నారు.
జాతీయ హోదా అనేదే లేదు : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కూడా తెలంగాణకు తీసుకురాలేదని ఉత్తమ్ తెలిపారు. ఇటీవల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రాన్ని ముఖ్యమంత్రి సంప్రదించగా, జాతీయ హోదా స్టేటస్ అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శాఖవత్ చెప్పారని గుర్తు చేశారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపింది. మేము ఎటువంటి సమాధానం చెప్పలేదు. బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలు, హరీశ్‌రావు స్టేట్మెంట్లో నిజం లేదు. కృష్ణా వాటర్ గురించి బీఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. రాష్ట్ర అమూల్యమైన సంపద బీఆర్ఎస్ పాలన వృధా చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలపై రూ.18,000 కోట్ల వడ్డీలు, రూ.9,000 కోట్లు చెల్లించకుండా రాష్ట్రనీటిపారుదల రంగంలో భారం మోపారు. నిబంధనలు పాటించని అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి
Bhatti Vikramarka on Seetharama Project : తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ వ్యయం రూ.1681 కోట్లు మాత్రమేనని చెప్పారు. 2014కి రూ.700 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. మరో రెండు ప్రాజెక్టులు రూ.1552 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేవి ఉన్నాయని అన్నారు. అవి మొత్తం 3,30,000వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులని వివరించారు. వాటిని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి రూ.18500 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఇంతటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.