Telangana Ministers On Peddapalli Minor Rape Case : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఇటీవల ఆరేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పందిస్తూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క ఈరోజు పెద్దపల్లిలో పర్యటించారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా రాత్రి మైనర్ బాలిక నిద్రిస్తున్న స్థలంతో పాటు అత్యాచారం హత్య జరిగిన చోటుకు వెళ్లి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రైస్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొంత మేరకు ఉందని గుర్తించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చడం దారుణమైన ఘటనగా పరిగణించారు. అనంతరం పెద్దపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
చిన్నారి హత్య దురదృష్టకరం - ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ : మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాయిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఖండిస్తుందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లికి వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు మంత్రులు తెలిపారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
నేరస్థుడిపై ఇప్పటికే ఫోక్సో కేసు నమోదు అయిందని, జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రెండున్నర లక్షల పరిహారం, మృతి చెందిన మైనర్ బాలిక తండ్రికి ఉద్యోగం, తమ స్వగ్రామమైన ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్‌తో మాట్లాడి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Peddapalli Minor Murder Case : అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన నిందితుడు గంజాయి వంటి మాదకద్రవ్యాలు స్వీకరించడం వల్లే జరిగిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గంజాయి, డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని మంత్రులు పేర్కొన్నారు.
"ఈ పాశవిక ఘటనపై ప్రభుత్వ చాలా సీరియస్‌గా ఉంది. ఇటువంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీటిన్నంటికీ కారణమేదైతే ఉందో, సామాజిక కారణాలు ఏవైనా కానీ పూర్తి స్థాయిలో మేము పరిశీలిస్తాం. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపేలా ఆదేశాలివ్వటం జరిగింది. ఆ దిశగానే మా ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది." - శ్రీధర్ బాబు, సీతక్క- రాష్ట్ర మంత్రులు
పెద్దపల్లి జిల్లాలో దారుణం - మైనర్ బాలికపై హత్యాచారం
పెద్దపల్లి చిన్నారి హత్యాచారం ఘటన - సుమోటోగా విచారణకు స్వీకరించిన బాలల హక్కుల కమిషన్