Junior Doctors Commense Indefinite Strike in Telangana : రాష్ట్రవ్యాప్తంగా జూడాలు నిరసనకు దిగారు. సోమవారం నుంచి జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. స్టై ఫండ్‌లు సకాలంలో అందించడం సహా మొత్తం 8 డిమాండ్‌లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఫలితం లేని కారణంగా సమ్మె చేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే సర్కారుకు నోటీసులు ఇచ్చి గురువారం నుంచి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. గురువారం నల్ల వస్త్రం నోటికి కట్టుకుని, శుక్రవారం నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం తమ సమస్యల్ని కళ్లున్నా చూడలేకపోతోందంటూ శనివారం కళ్లకు గంతలు కట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం కూడా తమ గోడు పట్టించుకోవడం లేదని జూడాలు మండిపడ్డారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా రోగులకు ఇబ్బంది కలగకూడదనే తిరిగి విధుల్లో చేరామని, అయినా సర్కారులో స్పందన లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో విధులు బహిష్కరిస్తునట్టు ప్రకటించారు.
ప్రభుత్వంతో చర్చలు సఫలం - సమ్మె విరమించుకున్న జూడాలు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అత్యవసర సేవలు మినహా ఒపీ,వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ ఆసుపత్రిలో బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్టైఫండ్ చెల్లించడం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత, నీట్‌లో 15 శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం,ఆస్పత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు పర్చడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మేను కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఉస్మానియాలో కొత్త భవనం కావాలంటూ డిమాండ్ : సమ్మె నేపథ్యంలో కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాలు ఆందోళనకు దిగారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్నా, పాలకులు పట్టించుకోవడం లేదని జూడాలు ఆరోపించారు. ఉస్మానియా హాస్పిటల్‌లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదని వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. తరుచు వైద్యులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వం స్పందించలేదు : వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో జూడాలు ఆందోళన దిగారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపేసి సమ్మెకు దిగారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలతో పాటు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో జూడాలు సమ్మెబాట పట్టారు. కళాశాలలో మౌలిక సదుపాయాలతో పాటు పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం ఇలాంటి ప్రధాన ఎనిమిది డిమాండ్లతో సమ్మె నోటీస్ అందించామని ప్రభుత్వం స్పందించకపోవడంతో ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళన బాట పట్టామని స్పష్టం చేశారు.
Juda's Strike: జూడాలకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి నుంచి పిలుపు