Irrigation Department On Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వలతో పాటుగా పునరుద్ధరణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి నీటి నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అధికారుల సూచనల ఆధారంగా పనులు చేపట్టనున్నారు.
కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అక్టోబరు, నవంబరులోపు పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. తద్వారా నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను తీసుకునేందుకు వారం రోజుల్లో దిల్లీకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో ఈ బ్యారేజీల రక్షణ చర్యలు, పునరుద్ధరణ పనులపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అందిన వివరాల మేరకు, ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ అందజేసిన మధ్యంతర నివేదిక, పరిశోధనలకు సంబంధించిన పురోగతిపై అధికారులు చర్చించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజినీర్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ : కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడిని విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ - JUSTICE GHOSE on KALESHWARAM
పరీక్షల సందర్భంగా నిర్మాణాల్లోని ఐరన్ మెటల్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ), సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సలహాలు, సూచనలు అందజేశారని నివేదికల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కూడా బ్యారేజీల్లో లోపాలు, పునరుద్ధరణకు సంబంధించి ఎన్‌డీఎస్‌ఏ నుంచి పూర్తి నివేదిక తెప్పించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు ఈ విషయాన్ని వివరించి నివేదికను వీలైనంత త్వరగా తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.