Agriculture Students Into Smart Farming : ఇటీవల కాలంలో యువత, విద్యార్థులు వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగం వైపు దృష్టి సారిస్తూ అవకాశాలు అందింపుచ్చుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి పట్టాలు సాధించి అన్నం పెట్టే అన్నదాతలకు సేవ చేయాలని ముందుకొస్తున్నారు. మరికొంతమంది వ్యవసాయ రంగంలోనే స్వయం ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉద్యోగ అకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
Telangana Horticulture University Convocation 2024 : పట్టాలందుకుంటున్న వీరింతా సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు. కెరీర్‌లో రాణించాలనే లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పట్టారు. పాక్టీకల్‌లోనూ మెరిశారు. అధ్యాపకుల సూచనలతో చదువుల్లో ప్రతిభ, నైపుణ్యాలు మెరుగు పరుచుకున్నారు. ఫలితంగా ఇలా తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారు పతకాలు, పట్టాలు అందుకున్నారు.
శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో 156 మంది ఉద్యాన డిగ్రీ, 50 మంది ఫారెస్ట్ డిగ్రీ పట్టభద్రులు అందుకున్నారు. అలాగే 45 మంది ఉద్యాన పీజీ , 30 మంది ఫారెస్ట్ పీజీ పట్టాలు సాధించారు. మరో 6గురు పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఇయితే కష్టపడి చదివి గవర్నర్ చేతుల మీదుగా పట్టాలతోపాటు బంగారు పతకాలను అందుకోవడం సంతోషంగా ఉందని పట్టభద్రులు అంటున్నారు..
బీఎస్సీ హానర్స్, హార్టికల్చర్ కోర్సుల్లో విద్యార్థులు సత్తాచాటారు. కూరగాయల విభాగంలో టాపర్‌గా నిలిచిన ఎం. మాళవిక 3గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. పండ్ల శాస్త్ర విభాగంలో జీఎస్ దివ్య పూల శాస్త్ర విభాగంలో పి.విద్యశ్రీ మెరిశారు. అలాగే... ఔషధ, సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పి.మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకుంది. అనుకున్న లక్ష్యంలో తొలి మైలు రాలిని దాటడం ఆనందంగా ఉందంటున్నారు ఈ విద్యార్థులు.
Telangana Horticulture University Gold Medalists : ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 420 గ్రాముల కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. కానీ, 325 గ్రాములే తింటున్నాం. మిగతా 75 గ్రాముల కొరత ఉన్న తరుణంలో ఉద్యాన పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు పట్టభద్రులు. అందుకోసం తన వంతు కృషి చేస్తానని చెబుతోంది సేంద్రీయ పసువు సాగుపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్న చందన మాచర్ల. నగరీకరణ నేపథ్యంలో ఫ్లోరికల్చర్, ల్యాండ్ స్కేపింగ్‌లో అవకాశాలు ఉన్నందున ఉద్యోగ కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతోంది పలుపునూరి విజయశ్రీ.
పంట కోత అనంతరం సరైన నిల్వ సామర్థ్యం లేకపోవడంతో 20 నుంచి 30 శాతం దిగుబడి నష్టం జరుగుతుంది. సదుపాయాలను మెరుగుపరుచుకోవడంతోపాటు సేంద్రీయ విధానంలో పంటలు పండిస్తే.. పంట దిగుబడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని పీహెచ్‌డీ గోల్డ్ మెడలిస్ట్ కొత్తా సుష్మ అంటుంది. ప్రెసిషన్ ఫార్మింగ్ , డేటా, కృత్రిమ మేధ, రోబోట్స్, డ్రోన్స్, రిమోట్ సెన్సార్స్ వంటి ఆధునిక వ్యవసాయ విజ్ఞానం రైతులకు పరిచయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రులు చెబుతున్నారు.
దేశంలో వ్యవసాయ, ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునే రైతుల అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఈ విద్యార్థులు. ఇదే పట్టుదల, సాధనతో రాణించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఆచార్యులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతామంటున్నారు ఈ పట్టభద్రులు.