Telangana High Court On HYDRA : హైడ్రాను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 99పై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేదాకా జీవో అమలును నిలిపిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రా ఏర్పాటుపై కౌంటరు దాఖలు చేసిన తరువాత ఒకేసారి పిటిషన్‌పై విచారణను చేపట్టి నిర్ణయాన్ని వెలువరిస్తామని పేర్కొంది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చి జీవో 99 చట్టబద్ధతను సవాలు చేస్తూ హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరఫున కౌంటరు దాఖలు చేస్తామని, దీనికి కొంత గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కోరారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ జీవో అమలును నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో 10.24 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి జీవో 99కు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, ప్రభుత్వం కౌంటరు దాఖలు చేశాక విచారణ చేపడతామంటూ విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై హైకోర్టు : మరోవైపు గ్రూప్-1 పరీక్షలపై హైకోర్ట్‌లో భిన్న వాదనలు జరిగాయి. పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడంలేదని, పరీక్షల నిర్వహణలో అదే తరహాలో నిరక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గతంలో గ్రూప్-1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని, చేసిన తప్పును సరిదిద్దుకోవండా సుప్రీం కోర్టుదాకా వెళ్లిందన్నారు. టీజీపీఎస్సీ నిర్వాకం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులున్నాయని మరిన్ని సృష్టించడం తమకు ఇష్టం లేదంటూ సుప్రీం కోర్టు ఎస్ఎల్పీని కొట్టివేసిందన్నారు. కొన్ని వందల పోస్టుల భర్తీ నిమిత్తం నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది దరఖాస్తులు చేశారని, ఈ దశలో పారదర్శకంగా, నిస్పాక్షికంగా నిర్వహించాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం వెలువరించిన కీ లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. కీలో తప్పులున్నాయని నిపుణులు చెప్పినా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా కీని రూపొందించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. 2011 నుంచి గ్రూప్-1 నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. త్వరలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నందున దీనిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధించారు. టీజీసీఎస్సీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేశారు.