Telangana HC On Additional Seats in Engineering Courses : కొత్త కోర్సులను ప్రారంభించేందుకు సీట్లపెంపు, కుదింపునకు, కోర్సుల విలీనానికి, రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్‌చేస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన సుమారు 30 దాకా పిటిషన్లపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, కాలేజీలు ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొంది, జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్నట్లు తెలిపారు.
కంప్యూటర్ కోర్సు, అనుబంధ కోర్సులను సీట్లను పెంచుకోవడానికి జేఎన్‌టీయూ ఎన్వోసీ జారీ చేసిందన్నారు. దీని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేయగా తనిఖీలు చేసి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు. ఐతే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసీటీఈ షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ కారణం కాదు : ఐతే కాలేజీల ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించిందన్నారు. డిమాండ్‌ను బట్టి సంప్రదాయ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచితే ప్రభుత్వానికి నష్టంలేదన్నారు. ఎలాంటి కారణాలు పేర్కొనకుండా దరఖాస్తులను తిరస్కరించడం చెల్లదన్నారు. కోర్సుల్లో సీట్ల పెంపు, తగ్గింపు, విలీనం అంశాలను విస్తృత కోణంలో చూస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అందుబాటులో ఉన్న మౌలిక వసతులు బోధనా సిబ్బంది. విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీచేస్తుందని, దానిఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి అమోదం తీసుకొని సర్కార్ అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీట్ల పెంపునకు ఫీజు రీయంబర్స్మెంట్ వంటి ఆర్ధిక పరిమితులే కారణం కాదన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులే ఫీజు చెల్లించుకునేట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి ముందుకు రావాల్సి ఉందన్నారు.
HC Verdict on Private Engineering Colleges : కాలేజీలను నిపుణుల సందర్శన కమిటీ సందర్శించి వసతులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొన్ని కాలేజీలకు అదనంగా 120 సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరతఉందని, అందువల్ల సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సీట్లను పునరుద్ధరించాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాసినట్లు చెప్పారు.
రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతుల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సీట్ల సంఖ్యను పెంచుకోమడానికి కొన్ని కాలేజీలకే అనుమతిస్తూ మిగిలిన కాలేజీలపై ప్రభుత్వం వివక్ష చూపిందనడానికి పిటిషనర్లు, కోర్టు ముందు ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు. కొన్ని కాలేజీలకు అక్రమంగా సీట్లు కేటాయించారని ఈ వివక్షను కారణంగా చూపుతూ తమకూ ప్రయోజనం కల్పించాలని కోరే హక్కు ఇతర కాలేజీలకు లేదని స్పష్టం చేశారు.
సంస్థల మధ్య సమతుల్యతను పాటించడంలోను విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులను, హేతుబద్ధీకరించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడవని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టివేశారు. అదేవిధంగా ఆఫ్ క్యాంపస్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం సరైనదే : హైకోర్టు - TG HC on Bhoodan Yagna Board