Big Relief to Ex Mla Patnam Narender Reddy : లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు కేసులలో రెండు కేసులను హైకోర్టు కొట్టివేసింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో రెండింటిని కొట్టివేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
లగచర్లలో ఈ నెల అధికారులపై జరిగిన దాడిలో బోంరాస్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. మొదట ఒక కేసు నమోదు చేసిన అధికారులు.. అనుబంధంగా మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లోనూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ నిర్వహించారు.
ఒకే ఘటనలో వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటీషనర్ తరఫు న్యాయవాది రమణ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తీర్పు కాపీలను చదివి వినిపించారు. ఇదే హైకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని వాదించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సి వచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో గత వారం తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈ రోజు ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది.
అసలేం జరిగింది : లగచర్ల ఘటనలో పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిగణలోకి తీసుకున్న కొడంగల్ కోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్ విధించిందని.. ఆ ఉత్తర్వులను కొట్టేయాలని పట్నం నరేందర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే నరేందర్ రెడ్డి అరెస్టును హైకోర్టు మాత్రం తప్పుపట్టింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలా అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దాడికి గురైన వారికి తగిన గాయాలేమో.. స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారని, కానీ పోలీసులు మాత్రం గాయాలు తీవ్రంగా ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారని హైకోర్టు తప్పుపట్టింది.
'మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ?' - లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా అరెస్ట్ చేస్తారా? - పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం