Telangana High Court Verdict on MLAs Disqualification : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్టప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్‌ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.
హైకోర్డు తీర్పుతో ఉప ఎన్నికలు తథ్యం : హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైకోర్డు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టేలా ఉందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా శాసన సభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హత ఫిటీషన్ల పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024
ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు.
తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం…
హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ స్పందించాలి : ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. నెలన్నర క్రితమే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినా చలనం లేదని విమర్శించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా రాహుల్ స్పందించాలని డిమాండ్ చేశారు. నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాహుల్ అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు.
ఎన్ని రోజులకైనా కోర్టు తీర్పులను తప్పించుకోజాలరని, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తాము విలువలకు పట్టం కడుతున్నామని ఎందుకు చెప్పడం లేదని ఓ ప్రకటనలో నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, చెప్పే మాటల్లో చిత్తశుద్ధి ఉంటే రాహుల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాహుల్ మాటలు, చేతలు ద్వంద్వ విధానంగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
Congress on MLAs Disqualification Case : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆ మార్గదర్శికాలను కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి నెలకొందన్న అద్దంకి, గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీఎల్పీని మెర్జ్ చేసుకోకునే వరకు హైకోర్టు ఆగకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతోందని పేర్కొన్నారు. మాజీమంత్రులు హరీశ్‌రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు బీఆర్ఎస్‌ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పునకు కారణమని విమర్శించారు.