Telangana High Court on Caste and Religion Option : పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికేట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరు దాఖలుకు మరోసారి గడువు కోరరాదని స్పష్టం చేసింది. మూడు వారాల్లో ఇందుకు సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది. పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికేట్లలో తల్లిదండ్రుల కులం, మతం పేర్కొనాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డీవీ రామకృష్ణ మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె. అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ జనాభా గణన సమయంలో కులమతాల వారీగా సేకరించిన గణాంకాలు నిత్యజీవితంలోగానీ, పాఠశాల రికార్డుల్లోగానీ ఎందుకు ఉపయోగపడవని పేర్కొంది. అయితే వాటిని ఉంచాలా లేదా అన్నదానిపై ప్రభుత్వాలు తీసుకోవాల్సిన విధాన నిర్ణయమని తెలిపింది.
మరోసారి గడువు కోరవద్దు : దీనిపై కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇప్పటికే జాప్యం జరిగిందని తెలిపింది. మరోసారి గడువు కోరకుండా కుల, మత ప్రస్తావన లేకుండా పాఠశాల రికార్డులను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేమిటో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది.
రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదును చట్టప్రకారం విచారించండి : హైకోర్టు - TELANGANA HC ON CM REVANTH CASE