Telangana High Court On Emaar Properties Land : ఎమ్మార్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో అధికారులు అనుసరించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. అవార్డు నోటీసు ఇవ్వకుండా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇద్దరు రైతులకు చెందిన భూమిని ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్ రాంగూడలోని సర్వే నెం 48, 49లలో ఇద్దరు రైతులకు చెందిన సుమారు 14 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అవార్డును, రిజిస్ట్రేషన్, లీజు ఒప్పందాలను రద్దు చేసింది.
చట్టవిరుద్ధంగా లీజు రిజిస్ట్రేషన్ : అవార్డు విచారణ తిరిగి జరిపి వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అవార్డును ప్రకటించాలని ఆదేశించింది. నానక్‌రాంగూడ గ్రామంలో సర్వే 49, 48లలో 14 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా తీసుకొని, ఎమ్మార్‌కు, ట్రాన్స్‌కోకు చేసిన లీజు రిజిస్ట్రేషన్, ఒప్పందాలను సవాలు చేస్తూ సదానందం, సూరారం ప్రతాప్ రెడ్డిలు వేర్వేరుగా 4 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు.
అవార్డు జారీ చేసిన 5 ఏళ్లలోగా భూమిని స్వాధీనం చేసుకోని పక్షంలో భూసేకరణ నోటిఫికేషన్ కాలం చెల్లిపోతుందని న్యాయమూర్తి తెలిపారు. ఇక్కడ పిటిషనర్లకు చెందిన భూమికి అవార్డు గురించి గానీ, భూమిని స్వాధీనం చేసుకున్నట్లు నోటీసు, సమాచారం ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అవార్డు విచారణ నోటీసు జారీ అవార్డు ప్రకటన వివరాలను అధికారులు చూపించడంలేదన్నారు. అత్యవసర నిబంధన కింద స్వాధీనాన్ని ఇదే హైకోర్టు కొట్టివేసిందని, తరువాత స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు.
భూమిని తీసుకున్నామని చెప్పడమే గానీ పంచనామ తదితర ఆధారాలేనీ ఈ కోర్టుకు సమర్పించలేదన్నారు. ఏపీఐఐసీ కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. మరోవైపు ఇదే భూమికి సంబంధించి ప్రయోజనాలు కల్పిస్తే రోడ్డు వెడల్పు నిమిత్తం 1680 చదరపు గజాలు ఇవ్వడానికి సిద్ధమేనని జీహెచ్ఎంసీకి 2021 నవంబరులో పిటిషనర్ లేఖ రాశారన్నారు. అంటే పిటిషనర్ల భూమిని ముందే స్వాధీనం చేసుకున్నామన్న వాదన అవాస్తవమని తేలుతోందన్నారు. పిటిషనర్‌కు తెలియకుండా జారీ చేసిన అవార్డును ఎమ్మార్, ట్రాన్స్‌కోలతో టీఎస్ఐఐసీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి అవార్డు విచారణ చేపట్టి, పిటిషనర్ల అభ్యంతరాలను స్వీకరించి చట్టప్రకారం భూసేకరణ చేపట్టాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.