KCR Writ Petition Heard in High Court : విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఎక్కడ కూడా ఏకపక్షంగా వ్యవహరించలేదని, కమిషన్ ఛైర్మన్‌కు ఉన్న అధికారాల మేరకే నోటీసులు జారీ చేశారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని, నోటీసులను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఆయన వాదించారు.
కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హతపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. విద్యుత్ కమిషన్ ఏప్రిల్‌లో జారీ చేసిన నోటీసులకు సమయం కావాలని కేసీఆర్‌కు కోరడంతో, ఆ మేరకు అనుమతించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. కమిషన్ ఛైర్మన్ ఎల్.నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు మాట్లాడలేదని, పక్షపాతంగా ఎక్కడా వ్యవహరించలేదని ఏజీ పేర్కొన్నారు.
KCR Writ petition on Electricity Commission : తనకున్న పరిధి మేరకు కమిషన్ ఛైర్మన్ నోటీసులు జారీ చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఏమైనా అనుమానాలుంటే కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీయే గత అసెంబ్లీ సమావేశంలో సూచించిందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కమిషన్ ఇప్పటికే 15 మందిని విచారించిందని, అందులో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కూడా ఉన్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు.
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని కమిషన్ ప్రకటన కూడా ఇచ్చిందని, ఈ మేరకు ఎమ్మెల్సీ కోదండరాం, విద్యుత్ జేఏసీ నేత రఘుతో పాటు కొంతమంది సాక్ష్యాలు కూడా సమర్పించారని సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. వాళ్లు సమర్పించిన సాక్ష్యాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి ఈ నెల 19న మరో నోటీసు జారీ చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కమిషన్ బహిరంగ విచారణ చేస్తోందని, ఇందులో పక్షపాత ధోరణి అనేదే లేదని ఏజీ తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగిశాయి. మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ విచారణార్హతపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.